Mon Dec 23 2024 14:20:50 GMT+0000 (Coordinated Universal Time)
పైకి మామిడి కాయలు.. లోపల కరెన్సీ కట్టలు
మైసూరులో కోటి రూపాయల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికలంటేనే డబ్బుతో కూడుకున్నది. కోట్లు కుమ్మరించైనా గెలవాలనుకుంటారు అభ్యర్థులు. అందుకోసం అన్ని దారులు తొక్కుతారు. ఓటర్లకు చేరవేయాల్సిన డబ్బును అధికారుల కళ్లుగప్పి మరీ తరలించి రాత్రి వేళలో పంచుతుంటారు. కోట్ల రూపాయలు కుమ్మరిస్తే కాని గెలుపు దక్కదని భావించిన అన్ని పార్టీల నేతలు అందుకు ఆర్థికంగా బలమైన నేతలనే తమ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దింపడం ఆనవాయితీగా వస్తుంది.
కోట్లలో నగదు...
ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కోట్ల రూపాయల నగదును రోజూ అధికారులు సీజ్ చేస్తున్నారు. ఆటోల్లో తరలించే వారు కొందరైతే... రాత్రి పూట ప్రయివేటు వాహనాల్లో నగదును తరలిస్తూ పట్టుబడిన వారు మరికొందరు. కానీ సమాచారం మాత్రం బయటకు వస్తూ తనిఖీల్లో దొరికిపోతుండటంతో ఇప్పటికే కర్ణాటకలో వందల కోట్ల కరెన్సీ కట్టలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కోటి రూపాయల నగదు...
తాజాగా మైసూరులో కోటి రూపాయల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కొత్త తరహాలో ఈ నగదును వ్యాపారి దాచి పెట్టారు. మామిడి పండ్ల సీజన్ కావడంతో ఆ పెట్టెల్లో కోటి రూపాయల నగదును దాచిపెట్టిన ఘటన మైసూరులో వెలుగు చూసింది. అలాగే మామిడి కాయల చెట్ల మీద కూడా కరెన్సీకట్టలను గుర్తించారు. సుబ్రహ్మణ్య రై అనే వ్యాపారి ఇంట్లో కోటి రూపాయల నగదును మామిడి పండ్ల పెట్టెల అడుగున ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంటి ఆవరణలో...
సుబ్రహ్మణ్య రై పుత్తూరు నియోజవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ రైకు సోదరుడు కావడంతో అందిన సమాచారం మేరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సుబ్రహ్మణ్యరై ఇంటి ఆవరణలో మామిడి పండ్ల బాక్సులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటిని తనిఖీ చేయగా అందులో కోటి రూపాయల నగదు ఉన్నట్లు కనుగొన్నారు. కోటి రూపాయలకు లెక్కలు చెప్పకపోవడంతో ఆ కోటిరూపాయలను స్వాధీనం చేసుకుని సుబ్రహ్యణ్య రైను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Next Story