Sat Nov 23 2024 13:36:51 GMT+0000 (Coordinated Universal Time)
దేశవ్యాప్తంగా పెరిగిన చలితీవ్రత.. వారాంతంలో కనిష్టానికి పడిపోనున్న ఉష్ణోగ్రతలు
హిమాలయాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీల మీదుగా చలిగాలులు వీస్తుండటంతో
దేశంలో కొద్దిరోజులుగా చలితీవ్రత పెరుగుతూ వస్తోంది. దీపావళి నాటి నుంచి చలికాలం మొదలవుతుందని తెలిసిన విషయమే. కానీ.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చలితీవ్రత అధికంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలు మొదలు దేశమంతటా ఇదే పరిస్థితి. ఢిల్లీలో కనిష్టంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. వారాంతంలో అక్కడ ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు పడిపోతుందని, ఫలితంగా చలితీవ్రత రెట్టింపవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
హిమాలయాల నుంచి వచ్చే చలిగాలులతో..
శనివారం ఢిల్లీలో కనిష్టంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే.. గరిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలు మాత్రమే ఉంది. సాధారణంగానే ఢిల్లీలో కాలుష్య తీవ్రత ఎక్కువ. ఆ కాలుష్యంతోనే అక్కడి ప్రజలు నానా తంటాలు పడుతుంటారు. దానికి తోడు ఇప్పుడు పొగమంచు పెరగడం, చలితో ప్రజల ఇబ్బందులు అధికమవుతున్నాయి. అలాగే.. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమగిరుల్లో భారీగా హిమపాతం రావొచ్చని రికార్డులు చెప్తున్నాయి. హిమాలయాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీల మీదుగా చలిగాలులు వీస్తుండటంతో దేశవ్యాప్తంగా చలితీవ్రత పెరిగినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ చలిగాలుల కారణంగా.. ఉత్తర కశ్మీర్, గుల్మార్గ్, పహాల్ గామ్, లద్దాఖ్, లేహ్ ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఏపీలోనూ అదే పరిస్థితి
ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. విశాఖజిల్లా చింతపల్లిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 6.1డిగ్రీలు, పాడేరు, వంటల మామిడిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత, అరకులోనూ 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. వారంరోజులుగా క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. శనివారానికి రికార్డుస్థాయికి పడిపోయాయి.
Next Story