Mon Dec 23 2024 12:38:15 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలో గ్రామాల నుండి నగరాలకు "వందే మెట్రో" : మంత్రి అశ్వినీ వైష్ణవ్
వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు మినీ వెర్షనే "వందే మెట్రో". ఉద్యోగులు, వ్యాపారులు,కార్మికులు, విద్యార్థులకు ఈ వందే మెట్రో..
"వందే మెట్రో".. ఇదేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా ? నిజమే ఇది కొత్త ఎక్స్ ప్రెస్ రైలు. త్వరలోనే గ్రామాల నుండి నగరాలకు పరుగులు తీయబోతున్న ఎక్స్ ప్రెస్ రైలు. ఊళ్ల నుంచి నగరాలకు వివిధ పనుల గురించి..ఉపాధి గురించి వచ్చేవారి కోసం ‘వందే మెట్రో’ రైలు సేవలను ప్రారంభించాలని భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన చేశారు. వందే భారత్ రైళ్ల తరహాలో.. "వందే మెట్రో"ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ ప్రకటన చేశారు.
వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు మినీ వెర్షనే "వందే మెట్రో". ఉద్యోగులు, వ్యాపారులు,కార్మికులు, విద్యార్థులకు ఈ వందే మెట్రో రైళ్లు ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు. వందే మెట్రో రైళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పెద్దనగరాల చుట్టుపక్కల 50 నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు వివిధ పనుల నిమిత్తం అతితక్కువ సమయంలో నగరాలకు వచ్చివెళ్లేందుకు వీలుగా.. వందే మెట్రోను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ సంకల్పంతో.. ఈ ఏడాదే వందే మెట్రో రూపకల్పన, తయారీ 2023లోనే పూర్తవుతుందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా.. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా.. భారత్ లో తయారైన తొలి హైడ్రోజన్ రైలు అందుబాటులోకి వస్తుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.
Next Story