Thu Dec 19 2024 17:40:22 GMT+0000 (Coordinated Universal Time)
జీవనభృతిగా 280 కేజీల నాణేలు.. భర్త తిక్క కుదిర్చిన జడ్జి
కోర్టు ఆదేశాలను అతను పట్టించుకోకపోవడంతో.. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దాంతో దశరథ్ కుటుంబ సభ్యులు కోర్టు ఆదేశాల..
రాజస్థాన్ లోని జైపూర్ అడిషినల్ జిల్లా కోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వరకట్న వేధింపుల కేసులో ఓ వ్యక్తికి కోర్టు శిక్ష విధించింది. కొన్నినెలలుగా ఒంటరిగా ఉంటున్న భార్యకు జీవన భృతి కింద రూ.2.25 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చింది. ఆ భర్త అతితెలివికి జిల్లా జడ్జి దిమ్మతిరిగే షాకిచ్చారు. వివరాల్లోకి వెళితే.. జైపూర్ కు చెందిన దశరథ్ కుమావత్ 12 ఏళ్ల కిందట సీమా అనే మహిళను పెళ్లాడాడు. కొన్నాళ్ల తర్వాత సీమా దశరథ్ పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఐదేళ్లుగా ఈ కేసు కోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ క్రమంలో దశరథ్ తన భార్యకు జీవనభృతి కింద రూ.2.25 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.
కోర్టు ఆదేశాలను అతను పట్టించుకోకపోవడంతో.. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దాంతో దశరథ్ కుటుంబ సభ్యులు కోర్టు ఆదేశాల మేరకు సీమా కు జీవన భృతి చెల్లించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇటీవల రూ.55 వేల నగదును కోర్టుకు సమర్పించారు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ రూ.55 వేల నగదు.. రూ.2000 నోట్లైనా బ్యాంకులో మార్చుకోవచ్చు. కనీసం రూ.500,రూ.200, రూ.100 నోట్లు కాదు కదా.. ఒక్క కరెన్సీ నోటు కూడా లేదు. మొత్తం చిల్లర నాణేలే ఉన్నాయి. రూ.1,రూ.2, రూ.5 నాణేలతో కూడా 7 బాక్సులను దశరథ్ బంధువులు కోర్టుకు తీసుకొచ్చారు. వాటి బరువు అక్షరాలా 280 కేజీలు. జీవనభృతిని ఇలా నాణేల రూపంలో చెల్లించడంపై సీమా తరపు న్యాయవాది రామ్ ప్రకాశ్ కుమావత్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది ఖచ్చితంగా కక్షసాధింపు చర్యే అవుతుందని వాదించారు. దశరథ్ తరపు న్యాయవాది రమణ్ గుప్తా.. ఆ నాణేలన్నీ చెల్లుబాటులో ఉన్నవేనని, తన క్లయింట్ ఇలా చెల్లించడంలో న్యాయం ఉందన్నారు. అయితే అవన్నీ లెక్కపెట్టడం సాధ్యమయ్యే పనికాదని రామ్ ప్రకాశ్ వాదించగా.. జడ్జి ఆలోచించి.. ఆ భర్త తిక్కకుదిర్చే తీర్పిచ్చారు. జైల్లో ఉన్న దశరథ్ ఈ నాణేలను 1000 రూపాయల చొప్పున బ్యాగుల్లో ఉంచి కోర్టుకు అందించాలని తెలిపారు. దెబ్బకు మనోడికి దిమ్మతిరిగినంత పనైంది. తాడిని దన్నే వాడు ఒకడుంటే.. వాడిని తలనుదన్నే వాడు ఇంకొకడుంటాడంటే ఇదేనేమో. మిగతా లక్షా 70 వేల రూపాయలు చెల్లించేంతవరకూ దశరథ్ జైలులోనే ఉండాలని వెల్లడించారు.
Next Story