Tue Dec 24 2024 03:24:36 GMT+0000 (Coordinated Universal Time)
విద్యాసంస్థలు, థియేటర్లలో మాస్కులు తప్పనిసరి..
నాలుగు రోజుల క్రితం ఏపీలోని కోనసీమ జిల్లాలో ఒక ఒమిక్రాన్ కేసు.. గుజరాత్ లో మరో కేసును గుర్తించారు. తాజాగా ఆగ్రాలో తాజ్..
చైనాలో కరోనా కొత్తవేరియంట్ BF7 శరవేగంగా వ్యాప్తిస్తూ.. మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అక్కడ 25 కోట్ల పాజిటివ్ కేసులున్నాయి. ఇక మరణాలెన్ని నమోదవుతున్నాయో లెక్కలేదు. రోజూ వేలసంఖ్యలో మరణాలున్నట్లు సమాచారం. కానీ చైనా మాత్రం.. అసలు లెక్కేంటో చెప్పడం లేదని, 2020లో లెక్కలు దాచినట్లే.. ఇప్పుడు కూడా దాస్తోందన్న వాదనలున్నాయి. కాగా.. పొరుగుదేశమైన చైనాలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడంతో.. భారత్ లోనూ కరోనా వ్యాప్తి పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నాలుగు రోజుల క్రితం ఏపీలోని కోనసీమ జిల్లాలో ఒక ఒమిక్రాన్ కేసు.. గుజరాత్ లో మరో కేసును గుర్తించారు. తాజాగా ఆగ్రాలో తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన విదేశీయుడికి పాజిటివ్ గా గుర్తించిన అధికారులు.. నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. ఈ నేపథ్యంలో.. కర్ణాటక ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను మళ్లీ తెరపైకి తెచ్చింది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కేశవ సుధాకర్ వెల్లడించారు.
అలాగే నూతన సంవత్సర వేడుకలపై కూడా ఆంక్షలు విధించారు. పబ్ లు, రెస్టారెంట్లు, బార్లలో ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, నూతన సంవత్సర వేడుకలను రాత్రి 1 గంట లోపే ముగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వేడుకలు జరిగే చోట పరిమితికి మించి జనం గుమికూడరాదని పేర్కొన్నారు. ప్రస్తుతం BF7 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని మంత్రి అభిప్రాయపడ్డారు.
Next Story