Mon Dec 23 2024 09:50:43 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ కొత్త డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్
ఐఐటీ ఢిల్లీ విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్న ఆయన.. ఆ తర్వాత పోలీస్ విభాగంలో ప్రవేశించి 1989లో..
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన సీబీఐ డైరెక్టర్ గా కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక డీజీపీగా ఉన్నారు. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్.. 2020లో కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్ కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం ముగిసిన వెంటనే ప్రవీణ్ సూద్ బాధ్యతలు చేపడుతారని కేంద్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని హైపవర్ సెలెక్షన్ కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్ గా ఎంపిక చేసింది. ఐఐటీ ఢిల్లీ విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్న ఆయన.. ఆ తర్వాత పోలీస్ విభాగంలో ప్రవేశించి 1989లో మైసూరు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం బళ్లారి, రాయచూరు ఎస్పీగా పనిచేసి, పదోన్నతిపై బెంగళూరు నగర డీసీపీగా వచ్చారు. 1999లో డిప్యుటేషన్ పై మారిషస్ దేశానికి పోలీస్ సలహాదారుగా నియమితులయ్యారు. 2004-2007 మధ్య కాలంలో ప్రవీణ్ సూద్ మైసూరు పోలీస్ కమిషనర్ గా వ్యవహరించారు. ఆయన సేవలకు గుర్తింపుగా పలు విశిష్ట పురస్కారాలు కూడా వరించాయి. 1996లో చీఫ్ మినిస్టర్ గోల్డ్ మెడల్, 2002లో పోలీస్ మెడల్, 2011లో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్, 2006లో ప్రిన్స్ మైకేల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు, 2011లో నేషనల్ ఈ-గవర్నెన్స్ స్వర్ణ పురస్కారం అందుకున్నారు.
Next Story