Fri Nov 22 2024 10:43:35 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో టెన్షన్.. అతడు మంకీపాక్స్ తో చనిపోయాడు
ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ వైరస్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే..!
ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ వైరస్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే..! భారత్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు పుట్టుకొస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వ్యక్తులలో మంకీపాక్స్ లక్షణాలు కనపడ్డాయి. మంకీ పాక్స్ వైరస్ బారిన పడిన 22 ఏళ్ల కేరళ యువకుడు మృతి చెందాడనే వార్త ఆందోళనకు కారణమైంది. పది రోజుల క్రితం యూఏఈ నుంచి కేరళకు రాగా అప్పటికే అతడికి మంకీ పాక్స్ సోకి ఉందని గుర్తించారు. ఈ విషయం ఆలస్యంగా తెలిసిందని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. అతడి నమూనాలను పరీక్షల కోసం పంపారు. మృతికి కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు.
జులై 21 తేదీన యూఏఈ నుంచి 22 ఏళ్ల యువకుడు కేరళలోని త్రిసూర్ కు వచ్చారు. ఇక్కడికి వచ్చాక కొన్ని రోజులకు తీవ్ర జ్వరం, తలనొప్పి రావడంతో 27వ తేదీన స్థానిక ఆస్పత్రిలో చేరారు. మంకీ పాక్స్ లక్షణాలేమీ లేకపోవడంతో వైద్యులు సాధారణ చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. ఆ యువకుడు యూఏఈలో ఉన్నప్పుడే జులై 19వ తేదీన మంకీ పాక్స్ వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందనే విషయాన్ని కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. వైద్యులు ఆ యువకుడికి సంబంధించిన శాంపిళ్లను సేకరించి వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. యువకుడి మృతదేహానికి మంకీ పాక్స్ ప్రొటోకాల్ కు అనుగుణంగా అంత్యక్రియలు పూర్తి చేశారు.
శనివారం మరణించిన యువకుడిలో మంకీ పాక్స్ లక్షణాలు ఏవీ కనిపించలేదని.. ఆ యువకుడి మృతికి కారణాలను విశ్లేషిస్తున్నామని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. మంకీ పాక్స్ కొవిడ్ మాదిరిగా ప్రాణాంతకం కాదని.. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నా.. మరణాల రేటు చాలా తక్కువని తెలిపారు. సదరు యువకుడికి మంకీ పాక్స్ పాజిటివ్ వచ్చిన విషయాన్ని యూఏఈ అధికారులు బయటపెట్టకపోవడంపై విచారణ జరుపుతామన్నారు. దేశంలో మంకీ పాక్స్ వైరస్ సోకిన తొలి వ్యక్తి శనివారమే పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అవ్వగా.. ఇప్పుడీ ఘటన ఆందోళన కలిగిస్తోంది.
News Summary - Kerala confirms that deceased youth tested positive for monkeypox in UAE
Next Story