Fri Nov 08 2024 00:40:37 GMT+0000 (Coordinated Universal Time)
ఇక పిల్లలు UKG రెండు సార్లు చదవాల్సిందేనా..?
ఇక పిల్లలు UKG రెండు సార్లు చదవాల్సిందేనా..?
కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం యూకేజీ చదువుతున్న వారు 2023 జూన్ నాటికి ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో ప్రవేశానికి అర్హత లభిస్తుందని అక్కడి విద్యా శాఖ స్పష్టం చేసింది. ఆరేళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో చేరేందుకు అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఒకటో తరగతి చదివేందుకు ఐదేళ్ల ఐదు నెలలు ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన నిబంధనల కారణంగా పిల్లల తల్లిదండ్రులు అయోమయానికి గురవుతూ ఉన్నారు.
ప్రస్తుతం UKGలో ఉన్న విద్యార్థులు 2023 జూన్లో ఆరేళ్లు నిండని విద్యార్థులు.. 1వ తరగతికి అర్హత సాధించేందుకు మరో సంవత్సరం UKG చదవాల్సి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. "ఇది కొత్త నిబంధన. ఒకటవ తరగతిలోకి వెళ్లాలంటే పిల్లలకు 6 ఏళ్ల వయస్సు ఉండాలి'' అని ప్రజా బోధనా విభాగం కమిషనర్ విశాల్ తెలిపారు. 1వ తరగతిలో చేరడానికి పిల్లల కనీస వయస్సు ప్రస్తుత 5 సంవత్సరాల 5 నెలల నుండి 6 సంవత్సరాలుగా ఉండాలని అన్నారు. కొత్త నిబంధన అటు తల్లిదండ్రులనే కాదు, టీచర్లు, పాఠశాలలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రీ స్కూల్స్ అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంకా మానసికంగా, భావోద్వేగ పరంగా సన్నద్ధం కాకముందే ఒకటవ తరగతిలో చేర్చాలని చూస్తుంటారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పిల్లలపై ఒత్తిడిని తగ్గిస్తుందని అంటున్నారు.
ఈ ప్రకటన కారణంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రీస్కూల్లో ఇప్పటికే UKGలో చేరిన పిల్లలకు ఏమి జరుగుతుందో అని చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వస్తుందని భావిస్తూ ఉన్నారు. కర్ణాటక కౌన్సిల్ ఫర్ ప్రీస్కూల్స్ అసోసియేషన్ పిల్లలు 1వ తరగతి ప్రారంభించడానికి తగిన వయస్సు 6 సంవత్సరాలు అని అన్నారు. కౌన్సిల్ సెక్రటరీ పృథ్వీ బన్వాసి మాట్లాడుతూ "తల్లిదండ్రులు తమ పిల్లాడు వెనక్కు వెళతాడని భయపడవద్దు. వారి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పడాల్సిన అవసరం లేదు. గతంలో లాగా పదవీ విరమణ వయస్సు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, "అని అన్నారు. యుకెజిని పునరావృతం చేయాల్సిన పిల్లల కోసం ప్రీస్కూల్స్ ప్రత్యేక సన్నాహక దశను ప్రారంభించాలని కౌన్సిల్ సూచించింది.
ప్రభుత్వం అటువంటి నియంత్రణను చేయాలనుకుంటే, అది ప్రీ-ప్రైమరీ నుండి ప్రారంభించాలని.. నర్సరీలో ప్రవేశానికి వయోపరిమితిని నిర్ణయించాలని కొందరు వాదిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఇండిపెండెంట్ సిబిఎస్ఇ స్కూల్స్ అసోసియేషన్ యాజమాన్యం డిమాండ్ చేస్తోంది.
News Summary - Kids to repeat UKG if not 6 by June: Karnataka education department
Next Story