Fri Dec 20 2024 07:49:04 GMT+0000 (Coordinated Universal Time)
Lk Advani : పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ కు 96 ఏళ్లు
లాల్ కృష్ణ అద్వానీ నేటితో 96 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దేశమంతటా ఉన్న ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు
లాల్ కృష్ణ అద్వానీ నేటితో 96వ ఏట అడుగు పెట్టారు. రాజకీయాల్లో ఒక ట్రెండ్ ను సెట్ చేసిన అద్వానీ నేడు పాలిటిక్స్ కు దూరమైనా ప్రతి బీజేపీ కార్యకర్తకూ ఆయనొక మార్గదర్శి. ఈరోజు బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే అందులో యాభై శాతం భాగస్వామ్యం అద్వానీదేనంటారు. ఆయనకు ఇప్పటికీ పార్టీలకతీతంగా అభిమానులున్నారు. అద్వానీ కరడు కట్టిన హిందు నేతగా పైకి కనిపించినా మనసు మాత్రం వెన్న అని ఆయనను తెలిసిన వారంటారు. అందుకే అద్వానీని వాజ్పేయి తో సహా అందరూ గౌరవించేవారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చివర వరకూ కట్టుబడిన అద్వానీ నేడు 96వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
దేశమంతా అభిమానాలే....
1980 దశకంలో బీజేపీ అంటే గుర్తొచ్చేది వాజ్పేయి.. అద్వానీలే. అలాంటి అద్వానీ నేడు రాజకీయంగా వయోభారం కారణంగా దూరమయినప్పటికీ ఆయనకు దేశమంతా ఎందరో అభిమానులున్నారు. 1927 నవంబరు 8వ తేదీన సింథ్ ప్రాంతంలోని కరాచీలో జన్మించారు. అద్వానీ సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వ్యాపారవేత్త. అద్వానీ విద్యాభ్యాసం అంతా ఇప్పటి పాకిస్థాన్ లోని కరాచీ, హైదరాబాద్లోనే జరిగింది. ఇంజనీరింగ్ ను కూడా మానేసి పదిహేనేళ్ల వయసులోనే చదువుకు స్వస్తి చెప్పి ఆర్ఎస్ఎస్ లో చేరారు. 1947 సెప్బంబరు 12న భారత్ కు వచ్చారు. అనేక సార్లు అరెస్టయి జైలుకెళ్లారు.
జనసంఘ్ నుంచి...
శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ లో చేరిన అద్వానీలోని చురుకుదనం, ఆయన మాట్లాడే తీరును గుర్తించిన వారు ఎప్పటికైనా మంచి లీడర్ అవుతారని అంచనా వేశారు. వారి అంచనాలు వమ్ము కాలేదు. తొలుత రాజస్థాన్ జనసంఘ్ అధ్యక్షుడిగా పనిచేసిన అద్వానీ 1966లో తొలిసారి ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ కు జరిగిన మధ్యంతర ఠఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికయ్యారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యారు. 1975లో ఆయన మీసా చట్టం కింద అరెస్టయ్యారు. 1977లో జనతా పార్టీ నుంచి పోటీ చేసి మురార్జీ దేశాయ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఇక 1980వ దశకంలో అద్వానీ పేరు దేశమంతా తెలిసిపోయింది.
రెండు స్థానాల నుంచి...
1982లో భారతీయ జనతా పార్టీకి కేవలం రెండు లోక్సభ స్థానాలే లభించాయి. 1986లో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989 లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి 86 స్థానాలకు పెంచడంలో అద్వానీ పాత్రను మరువలేం. 1989లోనే ఆయన లోక్సభలో తొలిసారిగా కాలుమోపారు. ఇక ఆయన పేరు దేశమంతటా మారుమోగిపోయింది 1990లో. ఆయన ప్రారంభించిన రథయాత్ర బీజేపీని మరింత బలోపేతం చేసిందంటారు. పదివేల కిలోమీటర్ల రధయాత్రను పూర్తి చేయాలనుకున్నా ఆయన బీహార్ ప్రభుత్వం అడ్డుకున్న కారణంగా దానిని చేయలేకపోయారు. ఇక 1991 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 120 స్థానాలు దక్కాయంటే అది అద్వానీ రథయాత్ర ఫలితమేనని చెప్పకతప్పదు.
వయోభారంతో...
కానీ వయోభారం కారణంగా ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. ఆయనకు ప్రధాని పదవి వచ్చినట్లే వచ్చి అందకుండా పోయింది. అది ఒక్కటే ఆయన చేసిన కృషి.. పడిన శ్రమకు దక్కని ఫలితంగానే కాషాయదళం చూస్తుంది. అద్వానీ పుట్టినరోజు నాడు ప్రధాని నరేంద్రమోదీతో పాటు అనేక మంది నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇంటికి వెళ్లి అభినందనలు తెలుపుతున్నారు. ఈ వయసులోనూ ఆయన అందరితోనూ ఆప్యాయంగా పలుకరిస్తూ అందరి చేత శుభాకాంక్షలు అందుకుంటున్నారు. 96వ ఏటలో అడుగుపెట్టిన అద్వానీ నూరేళ్లు జీవించాలని "తెలుగుపోస్టు" కోరుకుంటుంది. హ్యాపీ బర్త్ డే అద్వానీజీ.
Next Story