Mon Nov 18 2024 02:45:36 GMT+0000 (Coordinated Universal Time)
Advani : 97 ఏళ్ల వయసులో భారత రత్న.. అసామాన్యుడు అద్వానీజీ
లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నత భారత పురస్కారం లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది
లాల్ కృష్ణ అద్వానీ... ఈ పేరు వింటే గౌరవం. భక్తి. వినయం. సంప్రదాయం అన్నీ ఒక్కసారిగా కలుగుతాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పులకించి పోతారు. వాజ్పేయి తర్వాత బీజేపీలో అద్వానీకే అంత సముచిత గౌరవం లభించింది. ఆయన నిబద్దత, అంకితభావంతో పాటు వేలెత్తి చూపలేని కటౌట్ ఆయనది. 1927లో ఇప్పటి పాకిస్థాన్ సింథ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలో అద్వానీ జన్మించారు. ఆయన సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. అయితే ఎందుకో తెలీదు... ఆయనకు చిన్న నాటి నుంచే సంఘ్ సిద్ధాంతాలంటే ప్రాణం. పదిహేనేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లోకి ప్రవేశించిన అద్వానీ దేశ విభజన సమయంలో భారత్ కు ఆయన కుటుంబం వలస వచ్చింది. తర్వాత భారతీయ జనసంఘ్ లో చేరి రాజకీయాల రుచిని చూశారు.
అలుపెరగని ప్రయాణం...
ఇక అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రయాణం మొన్నటి వరకూ అలుపెరగకుండా సాగింది. 1967లోనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడయ్యాడు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. 1980లో బీజేపీలో చేరిన తర్వాత ఆయన పార్టీ నేతల్లో ముఖ్యుడిగా మారారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత అందులో క్రియశీలక పాత్ర పోషించారు. వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రి పదవి చేపట్టిన అద్వానీ, 2009లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా దేశమంతా పర్యటించారు. కానీ బ్యాడ్ లక్ కానీ అప్పుడు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన ప్రధాని పదవి చేపట్టలేకపోయారు.
రధయాత్రతో...
ఇక ఆయన దేశ వ్యాప్తంగా చేపట్టిన రధయాత్రతో అద్వానీ పేరు మారుమోగిపోయింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం చేపట్టిన రధయాత్ర పార్టీని పల్లె నుంచి పట్టణ స్థాయి వరకూ విస్తరించేలా చేసింది. 1990 సెప్టంబరు 25వ తదేీన ఆయన సోమనాధ దేవాలయం నుంచి అయోధ్యవరకూ రధయాత్ర చేపట్టారు. పదివేల కిలోమీట్ల మేర ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ బీహార్ లో ఆయన యాత్రకు అప్పటి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం బ్రేకులు వేసింది. అయినా అయోధ్య కోసం ఆయన పోరాటం ఆగలేదు. అలాగే పార్టీ కోసం ఆయన నిరంతరం శ్రమించేవారు. పార్టీని అధికారంలోకి తేవాలన్న తపన ఆయన తనువంతా ఉండేది. ఆయనకు రాజకీయ శిష్యులు అనేక మంది ఉన్నారు. అందులో మన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒకరు.
రెండు స్థానాల నుంచి...
బీజేపీకి రెండు స్థానాల నుంచి 120 స్థానాలకు పెంచడంలో ఆయన చేసిన కృషిని మరవలేం. 1992లో కరసేవలో పాల్గొన్న అద్వానీ అరెస్ట్ అయ్యారు కూడా. పార్టీ అధ్యక్షుడిగా ఆయన చేసిన కృషిని ఏ కార్యకర్త మరవలేరు. ఉక్కుమనిషిగా పేరున్న అద్వానీ1998 నుంచి 2004 వరకూ ఉప ప్రధానిగా కూడా పనిచేశారు. దేశం కోసం ఆలోచించే అద్వానీకి 97 ఏళ్ల వయసులో భారతరత్న పురస్కారం లభించడం నిజంగా సముచితం అన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. లాల్ కృష్ణ అద్వానీ నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుందాం. ఆయన దేశానికి సేవలను స్మరించుకునేలా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ఇవ్వడం మరింత ఆనందమని కాషాయ పార్టీ నేతలు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story