Sun Dec 22 2024 21:25:39 GMT+0000 (Coordinated Universal Time)
15 రోజులు టైమ్.. జయప్రద లొంగిపోవాలి
ప్రముఖ నటి జయప్రదకు వరుస షాక్ లు తగులుతూనే
ప్రముఖ నటి జయప్రదకు వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు ఈఎస్ఐ చెల్లింపుల్లో అవకతవకల కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించగా తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వచ్చింది. 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించడమే కాకుండా.. రూ.20 లక్షలు కూడా డిపాజిట్ చేయాలంటూ తీర్పు వెలువరించింది.
రామ్‌కుమార్, రాజ్‌బాబులతో కలిసి జయప్రద చెన్నైలో ఓ థియేటర్ నిర్వహించారు. ఆ సమయంలో సిబ్బందికి ఈఎస్ఐ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఈ క్రమంలో న్యాయస్థానం జయప్రదతో సహా ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ జయప్రద హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి, ఈఎస్ఐ బాకీ కింద రూ.37.28 లక్షలు చెల్లించడం కుదురుతుందా? లేదా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని జయప్రదను కోరారు. రూ.20 లక్షలు చెల్లిస్తానని ఆమె చెప్పగా ఈఎస్ఐ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారం జయప్రద పిటిషన్ కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ కోర్టు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది. జయప్రదపై ఈ ఉల్లంఘన కేసు 2019లోనే స్వార్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థాన ధర్మాసనం ఆదేశించినా ఆమె హాజరుకాలేదు. దీంతో జయప్రదపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. గత ఎన్నికల్లో రాంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన జయప్రద సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజాంఖాన్ చేతిలో ఓటమిపాలయ్యారు.
Next Story