Thu Apr 03 2025 20:27:28 GMT+0000 (Coordinated Universal Time)
Maha kumbha Mela : ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా నేటితో ముగియనుంది

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా నేటితో ముగియనుంది. జనవరి 13 వ తేదీన మహా కుంభమేళా ప్రారంభమయింది. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేయడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అయితే ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి రావడంతో దేశం నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఇందుకోసం ప్రత్యేక ఘాట్లను ఏర్పాటు చేశారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకున్నారు.
అధికసంఖ్యలో...
ఈరోజుతో ముగియనున్న కుంభమేళాకు అధిక సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. శివరాత్రి కావడంతో పాటు పుణ్యస్నానాలకు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశముందని భావించిన ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసింది. తోపులాట జరగకుండా అన్ని చర్యలు తీసుకుంది. ఎక్కడికక్కడ భక్తులు స్నానమాచరించేలా చర్యలు తీసుకుంది. సంగం ఘాట్ లోనే స్నానం చేయాలని ఎక్కడా లేదని, ప్రయాగ్ రాజ్ లో ఎక్కడైనా పుణ్య స్నానాలు చేయవచ్చని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అరవై కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్ రాజ్ కు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారని ప్రభుత్వం చెప్పింది.
తొక్కిసలాట జరగకుండా...
ప్రయాగ్ రాజ్ లో అమృత్ స్నానాల సందర్భంగా ఇటీవల తొక్కిసలాట జరిగి పది మంది వరకూ మరణించిన ఘటన నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మరింత అప్రమత్తమయింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని తెలిపింది. అసత్య ప్రచారాలను చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సర్కార్ హెచ్చరించింది. వీఐపీలు వచ్చిన సమయంలోనూ భక్తులకు ఇబ్బంది కలగకుండా పుణ్యస్నానాలు ఆచరించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్ రాజ్ వస్తూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో కూడా భక్తుల మృతి చెందడంతో అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలోనూ నేడు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్ తో పాటు లోకల్ పోలీసులను కూడా భద్రత కోసం నియమించారు.
Next Story