Fri Nov 22 2024 19:29:18 GMT+0000 (Coordinated Universal Time)
మణిపూర్ అల్లర్లు.. దర్యాప్తు చేసేందుకు భయపడుతున్న పోలీసులు ?
ఇటీవల కుకీ తెగకు చెందిన ముగ్గురు మహిళలను మైతేయ్ వర్గానికి చెందిన కొందరు లైంగికంగా వేధించారు. ఈ ఘటన మైతేయ్..
మణిపూర్.. ఈ పేరు వినగానే ఎవరికై రక్తం మరిగిపోతుంది. ఇటీవల వెలుగుచూసిన మహిళలను నగ్నంగా ఊరేగించే వీడియో.. యావత్ దేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఘటన మనదేశంలో జరగడం మనకే సిగ్గుచేటని సామాన్యుడి నుంచి ప్రధాని వరకూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు సైతం ఈ కేసును సుమోటోగా తీసుకుని.. నిందితులపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఆ ఘటన తర్వాత.. మణిపూర్ లో జరిగిన మరిన్ని దారుణ ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
ప్రధానంగా అక్కడ రెండు తెగల మధ్య జరుగుతున్న గొడవలలో ఇప్పటి వరకూ మొత్తం ఏడుగురు మహిళలపై లైంగిక దాడులు జరిగినట్లు అక్కడి వర్గాలు చెబుతున్నాయి. అలాగే మహిళలను ఊరేగించిన రోజే ఆ ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలో ఒక వ్యక్తిని నరికేసి తలను కంచెకు వేలాడదీసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్వాతంత్య్ర సమరయోధుడి భార్యను కూడా సజీవదహనం చేశారన్న వార్తలు దేశాన్ని కుదిపేశాయి. ఆయా నేరాలపై నమోదైన జీరో ఎఫ్ఐఆర్ లు అక్కడి పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటివరకూ సుమారు 6 వేలకు పైగా జీరో ఎఫ్ఐఆర్ లు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు.
ఆయా కేసులపై దర్యాప్తు చేసేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్ లకు ఆ ఎఫ్ఐఆర్ లను పంపాల్సి ఉండగా.. రాష్ట్రంలో నెలకొన్ని క్లిష్టపరిస్థితులతో తీవ్ర జాప్యం ఏర్పడుతోందని మణిపూర్ పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ఫైల్ చేస్తారు. అయితే నేరం ఎక్కడ జరిగిందో సంబంధం లేకుండా.. అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఇదే అసలు చిక్కు. మణిపూర్ అల్లర్లలో దాదాపు 50 వేలమంది బాధితులు ఉండగా.. వారికి జరిగిన అన్యాయంపై కనిపించిన పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులు కేసులు నమోదు చేసి వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్ కు పంపాల్సి ఉంటుంది.
ఇటీవల కుకీ తెగకు చెందిన ముగ్గురు మహిళలను మైతేయ్ వర్గానికి చెందిన కొందరు లైంగికంగా వేధించారు. ఈ ఘటన మైతేయ్ తెగ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న తౌబాల్ జిల్లాలో చోటుచేసుకోగా.. అక్కడ కేసు నమోదు చేసేందుకు కుకీ తెగకు చెందిన బాధితులు సైకుల్ పట్టణ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. నెలరోజుల తర్వాత కేసును సంబంధిత పీఎస్ కు బదిలీ చేశారు. ఇంఫాల్ లోనూ ఇదే ఘటన జరుగగా.. సైకుల్ లో కేసు నమోదైంది. ఇక్కడొక్క పీఎస్ లోనే 202 జీరో ఎఫ్ఐఆర్ లు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. చురాచంద్ పుర్ పీఎస్ లో 1700 జీరో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఇలా తమ తెగ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయా తెగలకు చెందినవారు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటివరకూ అందిన ఫిర్యాదుల్లో మైతేయ్ తెగకు చెందినవారే ఎక్కువగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
అయితే.. రెండు తెగలకు చెందినవారిపై ఎఫ్ఐఆర్ లను విచారించేందుకు పోలీసులు సైతం వెనకడుగు వేస్తున్నారట. విచారణ కోసం వెళ్లే పోలీసుల్లో తమ తెగకు చెందినవారుంటేనే విచారణకు అనుమతిస్తున్నారని లేదంటే.. వారిపై కూడా దాడులకు దిగుతున్నారని అక్కడి పోలీసులు చెబుతున్నారు. దాంతో వారికి ఫోన్ చేసి వ్యక్తిగతంగా స్టేషన్ కు పిలిపించి మాట్లాడుతున్నారు. ఇలా రెండు తెగల ఘర్షణల నేపథ్యంలో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ లపై విచారణ చేయడం మణిపూర్ పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికీ అక్కడ అల్లర్లు, ఘర్షణలు ఆగకపోవడంతో.. వాటిని కంట్రోల్ చేసేందుకే సమయం సరిపోతుందని, కేసు విచారణకు సమయం ఉండటం లేదని పోలీసులు వాపోతున్నారు.
Next Story