Sun Nov 17 2024 15:53:49 GMT+0000 (Coordinated Universal Time)
Bengaluru: భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలం.. మళ్లీ మునిగిన ప్రాంతాలు
భారీ వర్షాలకు బెంగళూరు నగరం అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అతి పెద్ద ఐటీ హబ్ మాన్యత టెక్ పార్క్ కూడా నీట మునిగింది
భారీ వర్షాలకు బెంగళూరు నగరం అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫలితంగా అది వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. చెన్నై నగరం నీట మునిగింది. అదే సమయంలో బెంగళూరు నగరంలో కూడా అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అనేక రహదారులు చెరువులను తలపించాయి. అంతేకాదు సాఫ్ట్వేర్ కంపెనీలకు నిలయమైన అతి పెద్ద ఐటీ హబ్ మాన్యత టెక్ పార్క్ కూడా నీట మునిగింది. దీంతో సాఫ్ట్వేర్ కంపెనీల ఇంజినీర్లు ఇబ్బందులు పడ్డారు.
నీట మునిగిన ఐటీ పార్క్...
కార్యాలయానికి చేరుకోవడం కూడా కష్టంగా మారింది. మాన్యత టెక్ పార్క్ మూడు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో అన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడకు నలుమూలల నుంచి సాఫ్ట్వేర్ ఇంజినీర్లు రోజూ విధులకు చేరుకుంటారు. వేల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తారు. అది ఒక ప్రత్యేక సిటీగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు ఐటీ పార్క్ నీట మునిగింది. ఈ పార్క్ హెబ్బళ్ల - కృష్ణరాజపురం మార్గంలో ఉంది. దీంతో ఇది నీట మునిగి పోవడంతో ఐటీ హబ్ పార్క్ ను మూసివేయాల్సి వచ్చింది. వర్షపు నీరు పోటెత్తడం వల్ల ఐటీ కార్యాలయాలన్నీ కూడా మూతపడ్డాయి. మాన్యత టెక్ పార్క్లో నిర్మాణంలో ఉన్న కొన్ని భారీ భవనాల్లో వరద నీరు ప్రవేశించింది.
పెద్దయెత్తున నష్టం...
అక్కడి నిర్మాణ సామాగ్రి, వాటిని తరలించే వాహనాలు నీట మునిగాయి.వాటర్ ఫాల్స్లాగా అక్కడి నుంచి నీళ్లు కిందికి దూకడం ఇదే ఐటీ పార్క్లో భవనాల నిర్మాణం కోసం తవ్విన పునాదుల్లో వరద నీరు నిల్వ ఉండటంతో చిన్న సైజు చెరువును తలపిస్తోంది. దీంతో ఐటీ పరిశ్రమకు పెద్దయెత్తున నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. కంపెనీల యాజమాన్యం వర్క్ ఫ్రం హోం ను ఉద్యోగులకు కేటాయించ వలసి వచ్చింది. ఒక ఐటీ పార్కు మాత్రమే కాదు. బెంగళూరులోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వర్షం పడినప్పుడల్లా ఇలా ఐటీ కార్యాలయాలను మూసివేయాల్సి వస్తే ఇక తమ వ్యాపారం ఎలా సాగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. బెంగళూరు సేఫ్ ప్లేస్ కాదని భావిస్తూ అనేక ఐటీ కార్యాలయాలు ఇప్పటికే కొన్ని తరలిపోయాయని చెబుతున్నారు. చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ చాలా బెటర్ అన్న అభిప్రాయం బెంగళూరు ఐటీ కంపెనీ వాసుల్లో వ్యక్తమవుతుంది.
Next Story