Mon Dec 15 2025 08:01:38 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధానికి మంత్రి కేటీఆర్ కౌంటర్ : ఆ పనిచేస్తే పెట్రోల్ ధరలు తగ్గుతాయ్ !
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు రాష్ట్రాలే కారణమన్న మోదీ.. తెలంగాణ, ఏపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు,

హైదరాబాద్ : నిన్న అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో.. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలపై మోదీ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు రాష్ట్రాలే కారణమన్న మోదీ.. తెలంగాణ, ఏపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించకపోవడం వల్లే పెట్రోల్ ధరలు మండిపోతున్నాయని వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై మోదీకి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఇలా ఒక రాష్ట్రం పేరును ఎలా చెప్తారని కేటీఆర్ ప్రశ్నించారు.
కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. తాము వ్యాట్ ను పెంచకపోయినప్పటికీ రాష్ట్రం పేరును లేవనెత్తడమే మీరు మాట్లాడే కోఆపరేటివ్ ఫెడరలిజమా? అని ప్రశ్నించారు. 2014 నుంచి తెలంగాణలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను పెంచలేదని కేటీఆర్ తెలిపారు. అలాగే కేంద్రం వసూలు చేస్తున్న సెస్ లో చట్టబద్ధంగా తమకు రావాల్సిన 41 శాతం వాటా రావట్లేదని కేటీఆర్ విమర్శించారు. సెస్ పేరుతో రాష్ట్రం నుంచి 11.4 శాతం వాటాను లూటీ చేస్తున్నారని, కేంద్రం సెస్ ను రద్దు చేస్తే.. దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 70కి, డీజిల్ ధర రూ. 60కి వస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Next Story

