Sun Dec 14 2025 05:59:54 GMT+0000 (Coordinated Universal Time)
Mobile Internet: ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మొబైల్ ఇంటర్నెట్ బంద్
ఆదివారం 2,305 కేంద్రాలలో 11,23,204 మంది అభ్యర్థులు పరీక్షకు

గ్రేడ్ III పోస్టుల భర్తీకి రాత పరీక్ష సందర్భంగా సెప్టెంబర్ 15న ఉదయం 10 గంటల నుంచి మూడున్నర గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని అస్సాం ప్రభుత్వం ఆదేశించింది. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడడం కోసం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
టెలిఫోన్ లైన్ల ఆధారంగా వాయిస్ కాల్లు, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఎప్పటి లాగా పని చేస్తాయని తెలిపింది. న్యాయమైన, పారదర్శకంగా పబ్లిక్ పరీక్షను నిర్వహించడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నిరోధించడం కోసం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు హోం, రాజకీయ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అజయ్ తివారీ తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్/ మొబైల్ డేటా/ మొబైల్ వై-ఫై సేవలు నిలిపివేయనున్నారు. ప్రభుత్వ రంగంలోని గ్రేడ్ III పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 15న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.
నోటిఫికేషన్ ప్రకారం, ఆదివారం 2,305 కేంద్రాలలో 11,23,204 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇంతకుముందు ఇలాంటి సందర్భాల్లో కొన్ని అసాంఘిక శక్తులు వేర్వేరు మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి మోసాలకు పాల్పడ్డారని, అలాంటి వాళ్లను కట్టడి చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Next Story

