Tue Nov 05 2024 08:05:48 GMT+0000 (Coordinated Universal Time)
Karthika Masam : కార్తీక మాసంలో చేయకూడని పనులు ఏవంటే?
కార్తీక మాసం నేడు ప్రారంభమయింది. నెల రోజుల పాటు కార్తీక మాసం ఉండనుంది.
కార్తీక మాసం నేడు ప్రారంభమయింది. నెల రోజుల పాటు కార్తీక మాసం ఉండనుంది. కార్తీక మాసం. చలికాలం. ఈశ్వరుడిని ధ్యానించేందుకు ఉత్తమమైన కాలంగా భావిస్తారు. కార్తీక మాసంలో నదుల్లో పుణ్యస్నానాలు చేసుకుని భగవంతుడిని దర్శించుకోవడం పుణ్యమని పండితులు చెబుతున్నారు. కార్తీక సోమవారం ఖచ్చితంగా శివాలయాన్ని దర్శించుకుంటారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి భక్తులు శివుడిని ప్రార్థించాలని చెబుతారు. కార్తీక మాసంలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటికిటలాడిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు కూడా ఇందుకోసం ముస్తాబు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేసుకుని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
శివాలయాలన్నీ...
ఈ నెల 20వ తేదీన తొలి కార్తీక సోమవారం కావడంతో శివాలయాలు భక్తులతో కిటికిటలాడనున్నాయి. ఈ నెల 14వ తేదీన నాగుల చవితి పండగను కూడా తెలుగు రాష్ట్రాల్లో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. పాముల పుట్టలో పాలు పోసి తమ కోర్కెలు తీరాలని కోరుకుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. నెల రోజుల పాటు అత్యంత నియమ నిష్టలతో శివుడిని ప్రార్థిస్తుండటం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఆరోజుల్లో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని పదే పదే పండితులు కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమల్లో చెబుతూనే ఉంటారు. నియమ నిష్టలతో శివుడిని ఆరాధిస్తేనే కోరుకున్న ఫలితం దక్కుతుందని చెబుతారు.
వీటి జోలికి ...
కార్తీక మాసంలో శివుడిని ప్రార్థించే భక్తులు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం జోలికి నెలరోజులు వెళ్లకూడదు. అనాధలకు, పేద పిల్లలకు చలికాలం కావడంతో స్వెట్లర్లు, దుప్పట్లు వంటివి పంపిణీ చేయడం మేలైన పని అని చెబుతారు. దానధర్మాలన్నింటినీ గోప్యంగా నిర్వహించాలంటారు. ఇక ఉల్లి, మద్యం, మాసం వంటి వాటికి దూరంగా ఉండాల్సిందే. నిత్యం దీపారాధనలు చేయాలి. నువ్వుల నూనెతో వెలిగించే దీపం ఇంటికి అష్టైశ్యర్యాలతో పాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కలిగిస్తుందన్నది నమ్మిక.
నెల రోజుల పాటు...
ఈ కార్తీక మాసం నెలరోజులు నలుగు పెట్టుకుని స్నానమాచరించవద్దని సూచిస్తారు. ఈ మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పురాణలు కూడా ఇవే చెబుతున్నాయి. కార్తీక మాసం శ్రీమహా విష్ణువు, శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కావడంతో విశ్వాసమున్న వారు భక్తితో ధ్యానించాలి. అంతే తప్ప దైవ ధూషణ తగదంటారు. ఈరోజు ప్రారంభమైన కార్తీక మాసం డిసెంబరు 13వ తేదీతో ముగియనుంది. ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఈ మాసంలో దైవారాధన మధ్య గడుపుతారు. చలికాలం.. చన్నీటి స్నానం ఆలయ సందర్శనం.. సముద్ర స్నానం మంచిదన్న సూచనలు పండితులు చేస్తున్నారు.
Next Story