Sat Mar 15 2025 20:30:35 GMT+0000 (Coordinated Universal Time)
Tamilnadu : స్టాలిన్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ సిద్ధమయిందా?
తమిళనాడులో నియోజకవర్గాల పునర్విభజనలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమయింది

తమిళనాడులో నియోజకవర్గాల పునర్విభజనలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమయింది. అధికారంలో ఉన్న డీఎంకే దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. వరసగా అన్ని పార్టీల నేతలను కలుస్తూ ఈ నెల 22వ తేదీన జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానాలు అందిస్తున్నారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీలకు ఆహ్వానాలు పంపారు. స్వయంగా కలిసి సమావేశాలకు హాజరు కావాలని కోరుతున్నారు.
22న అఖిలపక్ష సమావేశం...
ఈ నెల 22వ తేదీన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలను ఏకం చేయడమే కాకుండా పార్లమెంటు స్థానాలు దక్షిణాదికి తగ్గకుండా చేయాలని, దక్షిణాదిని అణగదొక్కే ప్రయత్నం మానుకోవాలని ఈ సదస్సు నుంచి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు పంపనున్నారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటాయని చెప్పడంతో దక్షిణాది కంటే ఉత్తరాదికి ఎక్కువ స్థానాలు వస్తాయని, అందువల్ల రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. దక్షిణాదికి అన్యాయం జరగకుండా ఉండాలంటే నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవాలన్నది వారి లక్ష్యంగా కనిపిస్తుంది.
17న బీజేపీ ఆందోళన...
అయితే దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు ఏవీ తగ్గవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే గుర్తు చేసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. సీట్లు తగ్గకపోయినా దక్షిణాది కంటే ఉత్తరాదిన సీట్లు పెరిగితే అన్యాయం జరిగినట్లేనన్నది డీఎంకేతో పాటు దక్షిణాదిలో ఉన్న బీజేపీ యేతర పార్టీల నేతల వాదనగా ఉంది. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ కు పాల్పడిందని బీజేపీ ఈ నెల 17వ తేదీన ఆందోళనకు దిగుతుంది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో వెయ్యి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తుంది.
తమిళనాడులో లిక్కర్ స్కామ్...
ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా తమిళనాడులో లిక్కర్ స్కామ్ జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,820 మద్యం దుకాణాల్లో రోజుకు 150 కోట్ల విక్రయాలు జరుగుతున్నాయని ఈడీ అధికారులు తెలిపారు. ఏడు కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసిన టస్మాక్ సంస్థ నిర్వహించే మద్యం దుకాణాల్లో ఎక్కువ డీఎంకేకు చెందిన వారివేనని అంటున్నారు. ఈ నెల 6న టస్మాక్ మాజీ అధికారుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు దాడులు చేశారు.మూడు రోజుల పాటు ఈడీ సోదాలు జరిగాయి. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఈ నెల 17న వైన్ షాపుల ఎదుట బీజేపీ కూడా ఆందోళనకు దిగుతుండటంతో డీలిమిటేషన్ ఎఫెక్ట్ ను మద్యం స్కామ్ తో అణిచివేయాలని బీజేపీ చూస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Next Story