ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు ఊరట
ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని చెప్పడంతో నవనీత్ కౌర్ దంపతులను..
అమ్రావతి : మాజీ సినీ నటి, అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతులకు కాస్త ఊరట లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని చెప్పడంతో నవనీత్ కౌర్ దంపతులను పోలీసులు పది రోజుల క్రితం అరెస్టు చేశారు. అయితే నవనీత్ కౌర్ దంపతులకు ఎట్టకేలకు ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
సీఎం ఉద్దవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని సవాల్ విసిరిన అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు జైలు పాలైన విషయం వధితమే. సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామనడంతో నవనీత్ కౌర్ ఇంటిని సైతం శివసేన కార్యకర్తలు ముట్టడించారు. దీంతో రెండు వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చకొట్టినట్టు నవనీత్ దంపతులపై కేసు నమోదైంది. వీరిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ దంపతులకు పోలీస్ కష్టడీని నిరాకరించిన బాంద్రా కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విదించింది. నవనీత్ రాణాలు వేసిన బెయిల్ పిటిషన్ ను బాంద్రా కోర్టు తిరస్కరించింది. దీంతో మరో సారి బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీంతో ఎట్టకేలకు బెయిల్ మంజూరవ్వడంతో ఎంపీ నవనీత్ కౌర్ వర్గీయులు ఆనందం వ్యక్తం చేశారు.
కాగా.. ఏప్రిల్ 27న నవనీత్, రాణాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ముంబై పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. బొంబాయి బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో నవనీత్ దంపతులు సంబంధాలు కలిగి ఉన్నట్లుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దావూద్‌తో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలపై బాలీవుడ్ నిర్మాత యూసుఫ్ లక్డావాలాను ఇప్పటికే ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లక్డావాలా నుంచి నవనీత్ దంపతులు రూ.80 లక్షలను అక్రమంగా వసూలు చేశారన్నది సంజయ్ రౌత్ ఆరోపణ.