రూ. 400 కోట్లు ఇవ్వండి.. లేకపోతే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. 400 కోట్ల డబ్బు డిమాండ్ చేస్తూ ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈ మేరకు మంగళవారం పోలీసులు సమాచారం అందించారు.
అంబానీ కంపెనీకి సోమవారం ఈమెయిల్ వచ్చింది. నాలుగు రోజుల్లో అంబానీకి బెదిరింపు ఈమెయిల్ రావడం ఇది మూడోసారి అని ఒక అధికారి తెలిపారు. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి ఈమెయిల్లో.. ‘మీరు మా మాట వినలేదు.. ఇప్పుడు ఇవ్వాల్సిన మొత్తం రూ.400 కోట్లకు చేరింది. మీ భద్రత ఎంత కట్టుదిట్టం చేసినా మా స్నిపర్ ఒకరు చాలు’ అని రాశాడు.
అంతకుముందు శుక్రవారం వచ్చిన బెదిరింపు ఈమెయిల్ లో రూ.20 కోట్లు డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గామ్దేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత శనివారం మరో ఈమెయిల్ వచ్చింది. అందులో రూ. 200 కోట్లు డిమాండ్ చేశారు.
సోమవారం మూడవ ఈమెయిల్ వచ్చిందని పోలీసు అధికారి తెలియజేశారు. ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, సైబర్ బృందాలు ఈమెయిల్ పంపిన వారిని ట్రాక్ చేయడంలో బిజీగా ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు.
అంబానీ, అతని కుటుంబ సభ్యులకు చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు గత సంవత్సరం ముంబై పోలీసులు బీహార్లోని దర్భంగాలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం ముంబయిలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిని బాంబుతో పేల్చివేస్తామని కూడా నిందితులు బెదిరించారు.