Sat Nov 23 2024 03:03:11 GMT+0000 (Coordinated Universal Time)
నీట్ దరఖాస్తులకు గడువు పెంపు
కొన్నికారణాల వల్ల సకాలంలో నీట్ కు దరఖాస్తు చేసుకోలేకపోయామని కొందరు అభ్యర్థులు విజ్ఞప్తి చేయగా..
జాతీయ స్థాయిలో వైద్య విద్యకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తులకు తుది గడువును మూడ్రోజులు పెంచారు. ఏప్రిల్ 6 తోనే నీట్ దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే కొన్నికారణాల వల్ల సకాలంలో నీట్ కు దరఖాస్తు చేసుకోలేకపోయామని కొందరు అభ్యర్థులు విజ్ఞప్తి చేయగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11 అనగా నేటి నుంచి 13వ తేదీ వరకూ నీట్ కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ ప్రకటించింది.
ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 11.30 గంటల వరకూ దరఖాస్తులను స్వీకరిస్తామని, అదే రోజు రాత్రి 11.59 గంటల వరకూ నీట్ అభ్యర్థులు ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చని వెల్లడించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ అప్లికేషన్లలో ఏవైనా పొరపాట్లు ఉంటే వారిని సరిచేసుకునేందుకు ఎన్టీఏ తాజాగా కరెక్షన్ విండోను అందుబాటులోకి తీసుకువచ్చింది.
మే 7వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.20 గంటల వరకూ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 13 భాషల్లో పరీక్ష జరగనుండగా.. తెలుగులోనూ నీట్ రాసే వెసులుబాటు ఉంది. అభ్యర్థుల హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల సమాచారాన్ని ఎన్టీఏ అఫీషియల్ వెబ్ సైట్ లో చూడొచ్చు. మొత్తం 499 నగరాలు, పట్టణాల్లో నీట్ పరీక్ష జరగనుంది.
Next Story