Mon Dec 23 2024 16:29:43 GMT+0000 (Coordinated Universal Time)
Nipah Virus : హై అలర్ట్.. కేరళలో పెరుగుతున్న కేసులు... నిఫా వైరస్ అంటే ఏంటి? ఎలా వ్యాప్తి చెందుతుంది?
నిఫా వైరస్ మళ్లీ కేరళ రాష్ట్రంలో అలజడి రేపుతుంది. ఇప్పటికే ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి
నిఫా వైరస్ మళ్లీ కేరళ రాష్ట్రంలో అలజడి రేపుతుంది. ఇప్పటికే ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. కేరళలోనే ఈ వైరస్ గతంలో వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ రావడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. నిఫా వైరస్ సోకిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు కేసులు రావడంతో కేరళలోని అన్ని ఆసుపత్రుల్లో నిఫా వైరస్ కు అవసరమైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని పినరయి విజయన్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే ఆసుపత్రికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖను అప్రమత్తం చేసింది. ఒక బాలుడు మరణించడంతో అలర్ట్ అయ్యారు.
తొలి కేసు...
ఏ వైరస్ వచ్చినా అది తొలి కేసు కేరళలోనే నమోదవుతుంది. దానికి కారణం విదేశాల్లో కేరళ వాసులు ఎక్కువగా ఉండటంతో పాటు తరచూ రాష్ట్రానికి వచ్చి పోతుండటం వల్ల వివిధ రకాల వైరస్ లు వస్తున్నాయి. నిఫా వైరస్ సోకిన వారిలో 88 శాతం వరకూ మరణించారని వైద్య శాఖ నివేదికలు చెబుతున్నాయి. వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. 2001లో భారత్ లోకి ఈ నిఫావైరస్ వ్యాధి ప్రవేశించిందని వైద్యులు చెబుతున్నారు. ఇతర దేశాల్లో కూడా ఈ వైరస్ బారిన పడి మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. గతంలో పశ్చిమ బెంగాల్ లోనూ ఈ వైరస్ సోకింది.
మరణాల రేటు...
నిఫా వైరస్ కారణంగా మరణాల రేటు ఎక్కువగా ఉండటంతో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. నిఫా వైరస్ సోకిన వారిలో ఎక్కువగా జ్వరం, శ్వాసకోశ వ్యాధులు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. చివరకు కోమాలోకి వెళ్లిపోతారని చెబుతున్నారు. 2018లో కేరళ రాష్ట్రంలో ఈ వైరస్ సోకి పదిహేడు మంది మరణించారు. గబ్బిలాల ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కేరళ వెళ్లే పర్యాటకులు కొంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్క్ లు ధరించడంతో పాటు శానిటైజర్లు వాడటం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కోరుతుంది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కేరళ సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది.
Next Story