Mon Dec 23 2024 04:52:29 GMT+0000 (Coordinated Universal Time)
మృతదేహాలు భద్రపరిచిన స్కూల్ కూల్చివేత
బాలేశ్వర్ లోని బహనాగ సమీపంలో ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకుని ప్రయాణికులను కాపాడేందుకు..
జూన్ 2వ తేదీ రాత్రి ఒడిశాలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో వందలమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల మృతదేహాలను బోగీల నుంచి వెలికి తీసిన అనంతరం.. వాటిని బహనాగ ప్రభుత్వ పాఠశాలలో భద్రపరిచారు. ఆ తర్వాత అక్కడి నుండి ఆసుపత్రుల మార్చురీలకు తరలించారు. ఇప్పుటు ఆ ప్రభుత్వ పాఠశాలను అధికారులు కూల్చివేశారు. అందుకు కారణం స్థానికులతో పాటు.. ఆ పాఠశాలలో చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం భయభ్రాంతులకు గురికావడంతో పాటు.. స్కూల్ కూడా పాతబడటమేనని అధికారులు తెలిపారు.
బాలేశ్వర్ లోని బహనాగ సమీపంలో ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకుని ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించారు. ప్రమాదంలో 288 మంది మరణించగా.. ఆ మృతదేహాలన్నింటినీ హైస్కూల్ కు తరలించారు. అక్కడి నుంచి భువనేశ్వర్ కు తీసుకెళ్లారు. వందలాది మృతదేహాలను ఒకేచోట భద్రపరచిన ఆ ప్రాంతానికి వెళ్లేందుకు స్థానికులు జంకుతున్నారు. జూన్ 16 నుంచి పాఠశాలలు కూడా రీఓపెన్ అవనున్నాయి. విద్యార్థులు ఆ పాఠశాలకు వెళ్లేందుకు ధైర్యం చేయట్లేదని, తల్లిదండ్రులు కూడా పంపేందుకు నిరాకరిస్తున్నారని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల స్వేన్ తెలిపారు. 65 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ భవంతి కూడా దెబ్బతిందన్న ఆమె.. పాఠశాలను కూల్చివేయాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు.
యాజమాన్యం విజ్ఞప్తి మేరకు.. గురువారం బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ షిండే స్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించి కూల్చివేతకు అనుమతులు మంజూరు చేశారు. దాంతో శుక్రవారం స్కూల్ భవనాన్ని కూల్చి వేశారు. ఆ ప్రాంతంలోనే కొత్తభవనాన్ని నిర్మిస్తామని, అప్పుడు విద్యార్థులు కూడా ఏ బెరుకు, భయం లేకుండా పాఠశాలకు వస్తారని స్కూల్ యాజమాన్యం అభిప్రాయపడింది.
Next Story