Fri Nov 15 2024 12:33:25 GMT+0000 (Coordinated Universal Time)
రంగంలోకి దిగిన సీబీఐ
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ చేయనుంది. మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనపై రైల్వే బోర్డు సీబీఐ సిఫార్సు చేసిందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒడిశా ఘటన మానవ తప్పిదమా? లేక మరేదైనా అన్న కోణంలో జరిగిందా అనే దానిపై సీబీఐ విచారించనుంది. ఈ ఘోర ప్రమాదం వెనక ఉగ్రకుట్ర ఉండొచ్చని అంటున్నారు. మరోవైపు మానవతప్పిదమనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఇద్దరు రైల్వే అధికారుల ఫోన్కాల్ సంభాషణ కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ నిజానిజాలను బయటపెట్టేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.
కోరమాండల్ను కావాలనే లూప్లైన్లోకి మార్చారని ఆరోపణలు ఉన్నాయి. బహనాగ స్టేషన్ మేనేజర్ను కూడా అధికారులు విచారించారు. బహనాగ స్టేషన్ మాస్టర్ రూమ్, సిగ్నలింగ్ రూమ్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో ఎవరో మార్పులు చేశారని రైల్వే మంత్రి చెప్పారు. వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
రైల్వే ప్రమాద బాధితులను సులభంగా గుర్తించేందుకు వీలుగా ఒడిశా ప్రభుత్వం మూడు వెబ్సైట్లలో ప్రయాణికుల సమాచారాన్ని ఉంచింది. వెబ్సైట్లు https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న ప్రయాణీకుల జాబితాలను కలిగి ఉంటాయి. మరణించిన ప్రయాణీకుల జాబితా, చిత్రాలను కూడా ఈ వెబ్సైట్లలో ఉంచారు.
Next Story