Mon Dec 23 2024 04:14:42 GMT+0000 (Coordinated Universal Time)
ఒమిక్రాన్ అలజడి.. ఆ రాష్ట్రంలో కొత్త ఆంక్షలు, మార్గదర్శకాలు జారీ !
యూకే, ఫ్రాన్స్ పరిస్థితే మనదేశంలో రిపీట్ అయితే రోజుకు 13-14 లక్షల కేసులు నమోదవ్వొచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు
దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఒమిక్రాన్ కొత్త కేసులు.. కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. యూకే, ఫ్రాన్స్ పరిస్థితే మనదేశంలో రిపీట్ అయితే రోజుకు 13-14 లక్షల కేసులు నమోదవ్వొచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకూ దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 145కి చేరగా.. ఒక్క మహారాష్ట్రలోనే 48 ఒమిక్రాన్ కేసులున్నాయి. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ఆంక్షలు, మార్గదర్శకాలను జారీ చేసింది.
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో రద్దీని నివారించాల్సిందిగా ప్రజలను కోరింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు వార్డు స్థాయిలో స్క్వాడ్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అలాగే వివాహాలు, ఇతర శుభకార్యాల సమయంలోనూ కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు.. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేవారంతా పూర్తి వ్యాక్సినేషన్ తీసుకుని ఉండాలని ముంబై మున్సిపల్ అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లో 50 శాతం ప్రజలను మాత్రమే అనుమతించాలని కోవిడ్ మార్గదర్శకాల్లో పేర్కొంది.
తెలంగాణలోనూ కొత్త మార్గదర్శకాలు ?
ఇదిలా ఉండగా.. దేశంలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. ఢిల్లీలో 22, తెలంగాణలో 20, రాజస్థాన్ లో 17, కర్ణాటకలో 14, కేరళలో 11, గుజరాత్ లో 7, ఉత్తర ప్రదేశ్ లో 2, చంఢీఘడ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో ఒమిక్రాన్ కేసు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 12 కొత్త ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. నేడో, రేపో కేసీఆర్ సర్కార్ కూడా నూతన మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Next Story