Fri Nov 22 2024 14:41:00 GMT+0000 (Coordinated Universal Time)
25న పాక్షిక సూర్యగ్రహణం.. మళ్లీ పదేళ్లకే చూడగలం
అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుందని తెలిసిందే. 25న ఉదయం 8.58 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం మొదలవుతుంది.
ఈ నెల 25న పాక్షిక సూర్యగ్రహణం చోటుచేసుకోనుంది. ఇలాంటి సూర్య గ్రహణాన్ని మళ్లీ 2032లోనే చూడగలం. ఎందుకంటే.. అప్పటి వరకూ మనదేశంలో ఈ తరహా గ్రహణం ఏర్పడదు. 2025 మార్చి 29న మరో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది కానీ.. అది మనదేశంలో కనిపించదు. మళ్లీ 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడగలం. మరి.. ఈ నెల 25న ఏర్పడే సూర్యగ్రహణం ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా ?
అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుందని తెలిసిందే. 25న ఉదయం 8.58 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం మొదలవుతుంది. మధ్యాహ్నం 1.02 గంటలకు ముగుస్తుంది. కంటికి రక్షణనిచ్చే సాధనాలతో ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. చంద్రుడి ముఖం సూర్యుడికి అభిముఖంగా వెళ్లినపుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు సూర్యుడి కిరణాలు భూమిని చేరుకోకుండా చంద్రుడు అడ్డుపడతాడు. భూమికి, సూర్యుడికి మధ్య కక్ష్యలోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతుంది. దీంతో చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. దీన్ని సూర్యగ్రహణంగా చెబుతారు.
పాక్షిక సూర్యగ్రహణం ఇలా ఏర్పడుతుంది
సూర్యుడు, చంద్రుడు, భూమి సరిగ్గా ఒకే కక్ష్యలో లేనప్పుడు.. సూర్యుడి ఉపరితంలో కొంత భాగం చీకటిగా మారినప్పుడు పాక్షిక సూర్య గ్రహణంగా చెబుతారు. పాక్షిక సూర్య గ్రహణంలో ఆరంభం, గరిష్ఠం, ముగింపు అని మూడు భాగాలు ఉంటాయి. ఆరంభంలో చంద్రుడు సూర్యుడి డిస్క్ లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత సూర్యుడిలో అధిక భాగాన్ని కప్పేస్తాడు. ఆ తర్వాత క్రమంగా పక్కకు జరుగుతాడు.
Next Story