Tue Dec 24 2024 13:41:25 GMT+0000 (Coordinated Universal Time)
31 సంవత్సరాల తర్వాత పెరారివాలన్ విడుదల
రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన ఏజీ పెరారివాలన్ ను విడుదల చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన ఏజీ పెరారివాలన్ ను విడుదల చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వం చేసిన అప్పీల్ మేరకు ఆ కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఇప్పటికే ఇదే కేసులో నళినిని విడుదల చేశారు. ఇప్పుడు పెరారివాలన్ ను విడుదల చేయాలని.. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఆర్టికల్ 142 ప్రకారం అసాధారణ అధికారాలను ఉపయోగించుకుని పెరారివాలన్ ను విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. పెరారివాలన్ 31 ఏళ్లుగా జైలులో ఉంటున్నాడని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. ఈ ఏడాది మార్చి 9న బెయిల్ ను మంజూరు చేసింది.
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్ లో రాజీవ్ గాంధీని థాను అనే మహిళా మానవ బాంబుతో హత్య చేయగా.. ఈ కేసుకు సంబంధించి 1999 మేలో పెరారివాలన్, మురుగన్, శాంతం, నళినిలకు సుప్రీంకోర్టు ఉరి శిక్ష విధించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు నళిని ఉరి శిక్షను తమిళనాడు గవర్నర్ నిలిపివేశారు. పెరారివాలన్, మురుగన్, శాంతంలకు విధించిన ఉరి శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ 2014 ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
31 ఏళ్ల తర్వాత పెరారివాలన్ విడుదలకు జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 142 అధికరణ ద్వారా ధర్మాసనం ఈ ఆదేశం చేసింది. ఆర్టికల్ 161 కింద పెరారివాలన్‌ను విడుదల చేయాలని పెట్టుకున్న అభ్యర్థనపై తమిళనాడు గవర్నర్ తన నిర్ణయాన్ని తీసుకోవడం జాప్యం చేస్తున్నట్లు సుప్రీం భావించింది. పెరారివాలన్ రిలీజ్‌కు రాష్ట్ర క్యాబినెట్ అంగీకరించిందని, ఇక ఆర్టికల్ 142 ప్రకారం నిందితుడిని రిలీజ్ చేయడం సమంజసమే అని సుప్రీం అభిప్రాయపడింది. రాజీవ్ గాంధీ హత్యకు వాడిన బాంబు పరికరాలను పెరారివాలన్ అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ హత్య సమయంలో పెరారివాలన్ వయసు 19 ఏళ్లు.
- Tags
- Perarivalan
Next Story