Mon Dec 23 2024 10:34:33 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్, సావర్కర్ కు ప్రధాని నివాళి
ఆదివారం 101వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. కోట్లాది మంది ప్రజల మనసుల్లో ఎన్టీఆర్ సుస్థిర స్థానాన్ని..
సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ఆదివారం 101వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. కోట్లాది మంది ప్రజల మనసుల్లో ఎన్టీఆర్ సుస్థిర స్థానాన్ని సంపాదించారని పేర్కొన్నారు. చలన చిత్ర రంగంలో నటుడిగా, రాజకీయాల్లో ప్రజల కోసం కష్టపడి తన ప్రతిభతో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఎన్టీఆర్ తన నటనా కౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు జీవం పోశారని మోదీ తెలిపారు.
‘‘బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్ సినీరంగంలో ఖ్యాతిగాంచి.. కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారు. 300పైగా చిత్రాల్లో నటించి అలరించారు. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్ నటనను జనం ఇప్పటికీ స్మరిస్తారు’’ అని మోదీ మన్ కీ బాత్ లో గుర్తు చేశారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా సావర్కర్ కు ప్రధాని నివాళి అర్పించారు. సావర్కర్ ను ఖైదు చేసిన అండమాన్ లోని కాలాపానీ జైలును తాను సందర్శించిన రోజును ఎప్పటికీ మరచిపోలేనని ప్రధాని పేర్కొన్నారు. నిర్భయంగా, ఆత్మగౌరవంగా వ్యవహరించే సావర్కర్ శైలి.. బానిసత్వాన్ని ఎన్నటికీ అంగీకరించదని ప్రధాని 101వ మన్ కీ బాత్ లో చెప్పారు.
Next Story