Sun Dec 22 2024 23:15:33 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నం.. విశేషాలివే
ఈ చిహ్నం కంచుతో తయారైందని.. 6.5 మీటర్ల ఎత్తున్న దీని బరువు 9,500 కిలోలు అని వెల్లడించారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నూతన పార్లమెంట్ భవనాల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నూతన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన మూడు సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆవిష్కరించారు. జాతీయ చిహ్నం ఆవిష్కరణ సందర్భంగా పార్లమెంటులో పనిచేసే సిబ్బందితో మోదీ ముచ్చటించారు. సాధారణ ఇల్లు నిర్మిస్తామని భావిస్తున్నారా? లేక గొప్ప కార్యంలో భాగస్వాములు అయ్యారని భావిస్తున్నారా? అని ప్రధాని మోదీ కార్మికులను అడిగారు. వారంతా తాము ఒక గొప్ప కార్యంలో భాగంగా పని చేస్తున్నట్టు తెలిపారు. చరిత్ర నిర్మాణంలో భాగంగా ఉంటున్నామనే అనుభూతి తమలో ఉందని చెప్పారు.
ఈ చిహ్నం కంచుతో తయారైందని.. 6.5 మీటర్ల ఎత్తున్న దీని బరువు 9,500 కిలోలు అని వెల్లడించారు. పార్లమెంటు ప్రధాన భవంతి పైభాగాన దీన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. దీనికోసం నిలిపిన ఉక్కు ఆకృతే 6,500 కిలోల వరకు బరువుంటుందని అధికారులు తెలిపారు. నిర్మాణపనుల్లో నిమగ్నమైన ఇంజినీర్లతో పాటు కార్మికులతో ప్రధాని ముచ్చటించారు. కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు ఎంపీలు పాల్గొన్నారు. స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటి నుంచి ఈ నూతన భవనంలో పార్లమెంటు ఉభయ సభల సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022తో 75 సంవత్సరాలు పూర్తవుతాయి.
Next Story