Mon Dec 23 2024 23:23:46 GMT+0000 (Coordinated Universal Time)
జులై 1 నుండి ఈ నగరానికి నీటి కష్టాలు మొదలు.. జాగ్రత్త !
ఈ ఏడాది ముంబై తో పాటు.. దేశంలోని అన్నిప్రాంతాలకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైందన్న విషయం తెలిసిందే. ముంబైకి రెండు వారాలు..
సాధారణంగా వేసవిలో నీటి కష్టాలుండటం సహజం. నీటి కోసం పడే వెతలు అన్నీ ఇన్నీ కావు. ఆ కష్టాలు పడేవారికే బాగా తెలుస్తాయి. కానీ.. ఆర్థిక రాజధాని ముంబైకి వర్షాకాలంలో నీటి కష్టాలు తప్పేలా లేవంటున్నారు అధికారులు. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో.. ముంబైకి నీరందించే సరస్సుల్లో నీటి మట్టాలు అట్టడుగు స్థాయికి చేరాయట. దాంతో జులై 1 నుండి 10 శాతం నీటి కోత విధించాలని బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. నీటి కొరత దృష్ట్యా నగర ప్రజలు ఇకపై నీటిని పొదుపుగా వినియోగించాలని కమిషనర్ ఇక్బాల్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది ముంబై తో పాటు.. దేశంలోని అన్నిప్రాంతాలకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైందన్న విషయం తెలిసిందే. ముంబైకి రెండు వారాలు నైరుతి రాక ఆలస్యమైంది. ముంబై, థానే, నాసిక్ జిల్లాల్లోని భట్సా, అప్సర్ వైతర్ణ, మిడిల్ వైతర్ణ, తాన్సా, మోదక్ సాగర్, విహార్, తులసి ఈ ఏడు రిజర్వాయర్ల నుంచి ముంబైకి రోజుకి 3800 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఆయా రిజర్వాయర్లలో ప్రస్తుతం 7.26 శాతం నీరు మాత్రమే నిలువ ఉంది. ఇదే సమయానికి 2022లో 9.04 శాతం, 2021లో 16.44 శాతం నీటి నిల్వలున్నాయి. ప్రస్తుతం దాని శాతం మరింత తక్కువగా ఉండటంతో.. రానున్న కాలంలో ముంబై ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కోక తప్పదన్న సంకేతాలొస్తున్నాయి. ప్రస్తుతం ముంబైలో వర్షాలు కురుస్తుండగా.. ఈ వర్షాల వల్ల నీటి నిల్వలు పెరిగితే.. నీటి కోతలో మార్పులుంటాయని బీఎంసీ వెల్లడించింది. నీటి కోతలే కాదు.. వర్షపాతం తక్కువగా ఉంటే కరెంటు కోతలు కూడా తప్పవని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం శివాజీపార్క్, ప్రతీక్ష నగర్, సియోన్, దాదర్ ప్రాంతాల్లో 3 గంటల సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Next Story