Mon Dec 23 2024 09:26:26 GMT+0000 (Coordinated Universal Time)
ముర్ముకే జై కొట్టిన విపక్షాలు
రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. 21వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అయితే ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం దాదాపు ఖాయమైంది
రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 21వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అయితే ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం దాదాపు ఖాయమైంది. విపక్షాల నుంచి కూడా పెద్దయెత్తున క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆమెకు మెజారిటీ కూడా భారీ స్థాయిలో లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ద్రౌపది ముర్ముకు ఓటేయడంతో యశ్వంత్ సిన్హా కు అనుకున్న స్థాయిలో ఓట్లు రావన్న అంచనా వినపడుతుంది.
యూపీలోనూ...
ఒడిశాలోని కటక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మహ్మద్ ముకీమ్ తాను ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్లు ప్రకటించుకున్నారు. అలాగే యూపీలోనూ సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలు అనేక మంది ముర్ముకు మద్దతుగా నిలిచారు. యశ్వంత్ సిన్హా ఒకనాడు తమ నేత ములాయం సింగ్ ను ఐఎస్ఐ ఏజెంట్ అన్నారని, అందుకే ఆయనకు ఓటు వేయలేదని కొందరు సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెప్పారు.
భారీ మెజారిటీతో....
సమాజ్ వాదీ పార్టీతో పొత్తు ఉన్న సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్భర్ కూడా తన ఎమ్మెల్యేలతో కలసి ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు. ఇక గుజరాత్ లోని ఎన్సీపీ ఎమ్మెల్యే కంథాల్ జడేజా సయితం ముర్ముకే ఓటేసినట్లు తెలిపారు. మరోవైపు దేశ వ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి ముర్ముకు మద్దతు పెరగడంతో ఆమె భారీ మెజారిటీ లభిస్తుందంటున్నారు. క్రాస్ ఓటింగ్ జరగడంతో ముర్ముకు మరింత ఓట్ల శాతం పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
Next Story