Sun Nov 24 2024 21:37:37 GMT+0000 (Coordinated Universal Time)
Vegetables : పండగ పూట పచ్చడి మెతుకులేనా? కూరగాయలు కొనలేమా?
కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పండగ సీజన్ లో ధరలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పండగ సీజన్ లో ధరలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతటి భారీగా కూరగాయల ధరలు గతంలో ఏ సీజన్ లో పెరగలేదని అంటున్నారు. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో కూరగాయల పంట దెబ్బతినిందని కొందరు చెబుతున్నారు. నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు కూడా పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటున్నారు. పండగ పూట పచ్చడి మెతుకులు అన్న సామెత గత కొద్ది రోజుల్లోగా అందరి జీవితాల్లో కనిపిస్తుంది. ఎందుకో తెలియదు కానీ, ఒక్కసారి పెరిగిన కూరగాయల ధరలు మళ్లీ తగ్గడం లేదు.
సెంచరీ కొట్టేసిన టమాటా
వంటింట్లో కింగ్ గా భావించే టమాటా కిలో వంద రూపాయలకు చేరుకుంది. దీంతో టమాటాను ముట్టుకోవాలంటేనే షాక్ కొడుతుంది. ధనవంతుల ఇళ్లలో బంగారం మాదిరిగా టమాటా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇక ఉల్లిపాయల ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కిలో ఉల్లి ధర కూడా దాదాపు ఎనభై రూపాయల వరకూ ఉంది. ఇక ఏ కూరగాయలు తీసుకుందామని అనుకున్నా కిలో ధర ఎనభై రూపాయలకు తగ్గట్లదేదు. భారీ వర్షాల కారణంగా పంటల దిగుబడి పూర్తిగా తగ్గిందంటున్నారు. సెప్టెంబరు నెలలో ధరలు తగ్గుతాయని గత రెండు నెలల నంచి టమాటా ధర గురించి చెబుతున్నారు. అయినా కూడా అక్టోబరు నాటికి కూడా అదే ధర ఉండటంతో కొనుగోలు చేయలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఆకు కూరలు కూడా...
వంకాయ ధర కిలో వంద రూపాయలుగా ఉంది. ఒక మామిడికాయ ముప్పయి రూపాయలు పలుకుతుంది. ఇక ఆలుగడ్డ ధర కిలో ఎనభై రూపాయలుగా నమోదయింది. బెండ ధరలు కూడా అదిరిపోతున్నాయి. దీంతో పాటు ఆకు కూరల ధరలు కూడా మండిపోతున్నాయి. ఒకటేమిటి.. తోటకూర, మెంతికూర, గోంగూర, బచ్చలి కూర, పాలకూర, పొన్నగంటి ఆకు ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో పది రూపాయలకు మూడు కట్టలు వచ్చేవి. ఇప్పుడు రెండుకట్టలే ఇస్తున్నారు. అవీ చిన్న కట్టలు. ఇక కరివేపాకు, కొతిమీర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు వాటిని కొనుగోలు చేయలేక పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటున్నారు.
Next Story