Sun Dec 22 2024 17:43:32 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : పోటీకే విపక్ష నేతలు వణికిపోతున్నారు
బీజేపీ పోటీకి విపక్ష నేతలు వణికిపోతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
బీజేపీ పోటీకి విపక్ష నేతలు వణికిపోతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చ లో ఆయన మాట్లాడుతూ విపక్షాలపై నిప్పులు చెరిగారు. మూడో టర్మ్ లో ప్రపంచంలోనే భారత్ బలమైన ఆర్థిక శక్తిగా అవతరించబోతుందన్నారు. దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ నత్తనడకతో ఎవరూ పోటీ పడలేరని ఆయన ఎద్దేవా చేశారు. 2014 లో ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉంటే ప్రస్తుతం ఐదో స్థానానికి చేరుకుందన్నారు. ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని చెప్పారు.
కాంగ్రెస్ కు వందేళ్లు పడుతుందంటూ...
దేశాన్ని విభజించడమే కాంగ్రెస పని అంటూ ఆయన ఫైర్ అయ్యారు. తాము పదేళ్లలో చేసిన అభివృద్ధి కాంగ్రెస్ చేయాలంటే దానికి పదేళ్లు పడుతుందని అన్న మోదీ పదేళ్లలో మంచి విపక్షంగా కూడా ఆ పార్టీ నిరూపించుకోలేకపోయిందన్నారు. విపక్షాలు చాలా కాలం విపక్షంలో ఉండాలని సంకల్పం తీసుకున్నట్లు కనపడుతుందని చమత్కరించారు. వారి కోరికను భగవంతుడు తప్పనిసరిగా నెరవేరుస్తారని అన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు ప్రేక్షకుల సీట్లకే పరిమితమవుతారని చెప్పారు. మైనారిటీలపై ఇంకా ఎంత కాలం రాజకీయాలు చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు.
సీట్లు మార్చుకుంటున్నారంటూ...
వారసత్వ రాజకీయాలతో దేశానికి నష్టమని అన్నారు. తాము మేకిన్ ఇండియా అంటుంటే కాంగ్రెస్ క్యాన్సిల్ అంటుందని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలను కాంగ్రెస్ తక్కువగా అంచనా వేస్తుందని అన్న మోదీ కాంగ్రెస్ వైఖరితో దేశానికి నష్టమని తెలిపారు. గత ఎన్నికల్లో కొందరు లోక్సభ సీటు మార్చుకున్నారని, ఈ ఎన్నికల్లో మరికొంత మంది లోక్సభ నుంచి రాజ్యసభకు మారతారని రాహుల్, సోనియాలను ఉద్దేశించి పరోక్షంగా ప్రస్తావించారు. దేశ సామర్థ్యం మీద కాంగ్రెస్ కు నమ్మకం లేదన్న మోదీ భారతీయుల్లో ఆత్మనూన్యత ఎక్కువ అని ఎర్రకోట సాక్షిగా నాడు ఇందిరాగాంధీ అన్న మాటలను ఆయన గుర్తు చేశారు.
Next Story