Mon Dec 23 2024 16:41:43 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ కాన్వాయ్ ని బ్లాక్ చేయడం వెనక?
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన రద్దయింది. పంజాబ్ కు వెళ్లి ఆయన ప్రారంభోత్సవం చేయకుండానే తిరిగి వచ్చారు
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన రద్దయింది. పంజాబ్ కు వెళ్లి ఆయన ప్రారంభోత్సవం చేయకుండానే తిరిగి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం భద్రత వైఫల్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. తాను ఎయిర్ పోర్టుకు ప్రాణాలతో తిరిగి రాగలిగానని, పంజాబ్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలని మోదీ ట్వీట్ చేశారు. జాతీయంగా ఇది చర్చనీయాంశమైంది. మోదీ పర్యటనను రైతులు అడ్డుకుంటారని తెలిసి ముందుగా పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని బీజేపీ ధ్వజమెత్తుతోంది.
రోడ్డు మార్గం ద్వారా....
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లో ఈరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ఉదయం భఠిండా చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించక రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. అయితే ఒక వంతెనపై రైతులు రహదారిని బ్లాక్ చేశారు. మోదీ కాన్వాయ్ ఇరవై నిమిషాలు పాటు వంతెనపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక చేసేది లేక ప్రధాని వెనుదిరిగి వచ్చారు.
పంజాబ్ ప్రభుత్వ వివరణ...
అయితే పంజాబ్ ప్రభుత్వం కూడా ప్రధాని మోదీ పర్యటనలో భద్రతలోపంపై వివరణ ఇచ్చింది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ స్పందిస్తూ ఎలాంటి భద్రత వైఫల్యం లేదని, పదివేల మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే హెలికాప్టర్ ద్వారా రావాల్సిన ప్రధాని మోదీ ముందస్తు సమాచారం లేకుండా రోడ్డు మార్గంలో వచ్చేశారని, అదే సమస్యకు కారణమయిందని చన్నీ తెలిపారు. రోడ్డును క్లియర్ చేయాలని తాను నిరసనకారులను కోరానని కూడా తెలిపారు.
Next Story