Mon Dec 23 2024 07:05:28 GMT+0000 (Coordinated Universal Time)
పీఎంకే నేత హత్య కేసు : తమిళనాడులో 21 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్ డీపీఐ) కార్యకర్తలే రామలింగాన్ని చంపారని..
తమిళనాడు వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రైడ్స్ జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 21 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 2019 ఫిబ్రవరి5న పట్టలి మక్కల్ కచ్చి (పీఎంకే) పార్టీకి చెందిన నేత కే. రామలింగం హత్యకు గురవ్వగా.. ఆయన హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అప్పట్లో స్థానికంగా జరిగిన కొన్ని మతమార్పిడుల ఘటనలను ప్రశ్నించినందుకే రామలింగాన్ని హతమార్చారని ఎన్ఐఏ ఛార్జిషీట్ లో పేర్కొంది. తిరునల్వేలి జిల్లాలోని సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తమిళనాడు రాష్ట్ర చీఫ్ ముబారక్ నివాసంలో కూడా ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్ డీపీఐ) కార్యకర్తలే రామలింగాన్ని చంపారని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పరారీలో ఉన్న నిందితుల కోసం ఎన్ఐఏ విస్తృతంగా సోదాలు నిర్వహించింది. రామలింగం హత్యకేసులో మొత్తం 18 మంది నిందితులు ఉండగా.. ఐదుగురు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితులు మహ్మద్ అలీ జిన్నా, అబ్దుల్ మజిత్, భుర్ఖానుద్దీన్, షాహుల్ హమీద్, నఫీల్ హసన్ తదితరుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఒక్కొక్క నిందితుడిపై ఎన్ఐఏ రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ఆచూకీ చెప్పినవారికి ఆ మొత్తాన్ని అందజేస్తామని ప్రకటించినా ఇంతవరకూ ఆచూకీ తెలియలేదు. ఆదివారం ఉదయం నుంచీ తంజావూరు, మదురై, తిరునల్వేలి, తిరుపూర్, విల్లుపురం, తిరుచ్చి, పుదుకోట్టై, కోయంబత్తూరు, మైలదుత్తురై జిల్లాల్లో ఎన్ఐఏ నిర్వహించిన సోదాల్లో.. అనేక డిజిటల్ పరికరాలు (మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డ్లు, మెమరీ కార్డ్లు), కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
Next Story