Mon Nov 18 2024 03:41:05 GMT+0000 (Coordinated Universal Time)
పాపం పసికందు.. చిన్నారి కాళ్లను కొరుక్కుని తిన్న ఎలుకలు
తాజాగా ఝార్ఖండ్ లో అలాంటి ఘటన మరొకటి జరిగింది. గిరిధ్ లోని సదర్ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందును ఎలుకలు ..
గిరిధ్ : పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటు ప్రభుత్వ ఆస్పత్రులు.. ఆ లక్ష్యం దిశగా పనిచేయడం లేదు. ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితులు రోజురోజుకూ దారుణంగా తయారవుతున్నాయి. ఉన్న రోగాలను తగ్గించుకునేందుకు ఆస్పత్రికి వస్తున్న పేషంట్లకు ఎలుకల భయం పట్టుకుంటుంది. మౌలిక వసతుల మాట పక్కనపెడితే.. ఎలుకల దాడికి పేషెంట్లు భయపడుతున్నారు. ఇటీవలే వరంగల్ ఎంజీఎంలో ఓ రోగిని ఎలుకలు తీవ్రంగా కరవడంతో.. అతను మృతి చెందాడు.
తాజాగా ఝార్ఖండ్ లో అలాంటి ఘటన మరొకటి జరిగింది. గిరిధ్ లోని సదర్ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందును ఎలుకలు కరిచాయి. ఈ నెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలుకలు కరిచిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ధన్ బాద్ లోని షాహీద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చిన్నారి మోకాలుకు తీవ్రగాయమైందని, నిపుణులైన వైద్యుడితో శస్త్రచికిత్స చేయించామని తెలిపారు.
పసికందు తల్లి మమతాదేవి మాట్లాడుతూ.. గిరిధ్ ఆస్పత్రిలోని మోడల్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ విభాగంలో ఉన్న తన బిడ్డను చూసేందుకు వెళ్లినపుడు.. ఎలుకలు కాలిపై పాకుతూ.. మోకాలిని కరిచాయని పేర్కొంది. పాపకు కామెర్లు వచ్చాయంటూ ఆన్ డ్యూటీ నర్సు చెప్పిందని, మంచి ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ ఆ నర్సు సలహా ఇచ్చిందన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎన్ఎంను సస్పెండ్ చేసి, స్వీపర్ ను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.
Next Story