బ్లూ టిక్ కావాలంటూ కోర్టుకు.. మాజీ సీబీఐ బాస్ నాగేశ్వర్ రావుకు ఫైన్
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావుకు ఢిల్లీ హైకోర్టు జరిమానా విధించింది. ఆయన ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ లేకుండా చేయడంతో కోర్టుకెక్కారు ఆయన.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావుకు ఢిల్లీ హైకోర్టు జరిమానా విధించింది. ఆయన ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ లేకుండా చేయడంతో కోర్టుకెక్కారు ఆయన. తన ట్విట్టర్ హ్యాండిల్‌కు ఉన్న బ్లూ టిక్ మార్క్ ను ఆ సంస్థ యాజమాన్యం తొలగించిందని, బ్లూ టిక్‌ను పునరుద్ధరించేలా ట్విట్టర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలోనే నాగేశ్వరరావు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అనుకున్నది అవ్వకపోవడంతో మరోసారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం దృష్టి సారించిన ఢిల్లీ హైకోర్టు పిటిషన్‌పై విచారణకు నిరాకరించింది. ఒకే అంశంపై వరుసగా రెండు సార్లు ఫిర్యాదు చేస్తారా? అంటూ నాగేశ్వరరావుపై అసహనం వ్యక్తం చేయడమే కాకుండా.. ఆయనకు రూ.10వేల జరిమానాను విధించింది. ఇక నాగేశ్వరరావు ట్విట్టర్ హ్యాండిల్‌కు బ్లూ టిక్‌ను పునరుద్ధరించాలంటూ ట్విట్టర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో ట్విట్టర్‌ను సంప్రదించేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ నాగేశ్వరరావు మళ్లీ కోర్టుకు వచ్చారని జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్పుకొచ్చారు. "మేము ఏప్రిల్ 7న ఒక ఆర్డర్‌ని ఆమోదించాము. మళ్లీ కోర్టును ఎందుకు ఆశ్రయించారు? మీ క్లయింట్‌కు చాలా ఖాళీ సమయం ఉన్నట్లు కనిపిస్తోంది. మా నుంచి రిటర్న్ గిఫ్ట్ కావాలా" అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
నాగేశ్వర్ రావు తరఫు న్యాయవాది రాఘవ్ అవస్తీ వాదిస్తూ, ట్విట్టర్‌తో అతని చివరి కమ్యూనికేషన్ ఏప్రిల్ 18న జరిగిందని, నాగేశ్వర్ రావు అకౌంట్ ధృవీకరణ ఇంకా పునరుద్ధరించబడలేదని వాదించారు. ఏప్రిల్ 7న కోర్టు ఆదేశాలను అనుసరించి గత నెలలో రావు బ్లూ బ్యాడ్జ్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. ట్విటర్ బ్యాడ్జ్‌ను పునరుద్ధరించలేదని ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించారు. తన వెరిఫికేషన్‌ను పునరుద్ధరించాలని కోరడమే కాకుండా, మంత్రిత్వ శాఖలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కంప్లయన్స్, గ్రీవెన్స్ ఆఫీసర్లను నియమించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రావు కోరారు. సాధారణ ప్రజలు అనవసరమైన వేధింపులకు గురికాకుండా ఉండేలా.. యూజర్ ఐడెంటిటీ వెరిఫికేషన్‌తో పాటుగా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వినియోగదారుల ఫిర్యాదులను అధికారులు ప్రత్యేకంగా పరిష్కరించాలని వాదించారు. .
తెలంగాణకు చెందిన 1986-బ్యాచ్ IPS అధికారి అయిన నాగేశ్వర్ రావు ఆగస్టు 2020లో పదవీ విరమణ చేసారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎన్నో పోస్టులు పెడుతూ ఉంటారు. ఏప్రిల్ 7, 2016న, రావు ఐదేళ్లపాటు సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన ఒడిశా పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.