Mon Dec 23 2024 05:42:49 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : మండిపోతున్న ఉత్తర భారతం.. బయట కాలు పెడితే మసయినట్లేనట
రోహిణి కార్తె తన ప్రతాపాన్ని చూపుతుంది. ఉత్తర భారత దేశంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రోహిణి కార్తె తన ప్రతాపాన్ని చూపుతుంది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. రుతుపవనాలు వస్తాయన్న రాకతో ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలకు మాడు అదిరిపోయేలా ఎండలు అదరగొడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న ఢిల్లీలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడి పోయారు. అనేక మందికి వడదెబ్బ తగిలింది. ఒక ఢిల్లీలోనే కాదు.. ఉత్తర భారత దేశంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు.
బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ లోనూ...
ఉత్తర్‌ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ ఎండ వేడిమికి తట్టుకోలేక తలపై నీళ్లు పోసుకున్నారంటే ఎండల తీవ్రత ఎంత ఉందో చెప్పాల్సిన పనిలేదు. అలాగే బీహార్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎండల తీవ్రతకు పిల్లలు స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఎండల తీవ్రత తగ్గేంత వరకూ సెలవులు ప్రకటించాలని బీహార్ లో తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బీహార్ లోనూ యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయని చెబుతున్నారు. బీహార్ ప్రభుత్వం వెంటనే సెలవులు ప్రకటించాలని తల్లదండ్రులు ఆందోళనకు దిగారంటే పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెప్పొచ్చు. ఇక ఉత్తర్‌ప్రదేశ్ లోనూ ఎండల తీవ్రత అధికంగా ఉంది.
పర్యాటకుల అవస్థలు...
అయోధ్య రామమందిరాన్ని చూసేందుకు వెళ్లిన భక్తులు ఎండల దెబ్బకు గదులను వదిలి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఒకవైపు దక్షిణ భారతదేశంలో అక్కడక్కడా తొలకరి జల్లులు పలకరిస్తుంటే.. ఉత్తర భారత దేశంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది.ఎండల దెబ్బకు భూగర్భ జలాలు అడుగింటి పోయాయి.
నీరు వృధా చేస్తే జరిమానా...
నీటి ఎద్దడి ఏర్పడింది. నీటిని వృధా చేసిన వారికి నాలుగువేల రూపాయల జరిమానా విధిస్తున్నారు. విద్యుత్తు వాడకం కూడా పెరిగింది. 8,302 మెగావాట్ల విద్యుత్తు వాడకం జరిగిందని అధికారులు తెలిపారు. రాజస్థాన్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాజస్థాన్ లోని ఫలోడి పట్టణంలో 51 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో వేసవి సెలవుల్లో ఉత్తర భారత యాత్రకు వెళ్లిన పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో ఇలాంటి మార్పులు ఎప్పుడూ చూడలేదని ప్రజలు అంటున్నారు.
Next Story