Mon Dec 23 2024 02:52:26 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లికి ముందే యువతులకు ప్రెగ్నెన్సీ టెస్టులు.. వివాదాస్పదమైన సామూహిక వివాహాలు
సామూహిక వివాహాల నిర్వహణ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన’ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది.
ఇప్పుడు పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో తెలిసిందే. పెళ్లికి అమ్మాయి దొరికితే చాలు.. పెళ్లికి ముందు ఆమె ఏం చేసినా పర్లేదు.. పెళ్లి తర్వాత అంతా బాగుంటే అదే మేలు అనుకుంటున్నారు. కానీ.. ఒక పాతికేళ్ల క్రితం అయితే అమ్మాయిని చేసుకోవాలంటే కన్యత్వ పరీక్షలు చేయించేవారు. ఇప్పుడంటే మహిళలు అన్నిరంగాల్లోనూ రాణిస్తున్నారు కానీ.. మన పెద్దలకాలంలో ఆడవారు వంటింటి గడప దాటి బయటికి వచ్చేవారు కాదు కదా. ఆడవాళ్లకైతే కన్యత్వ పరీక్షలు చేస్తారు. కన్య కాకపోతే గర్భిణి అవుతుంది. మరి మగాడికి ఎప్పుడైనా ఇలాంటి పరీక్షలు చేశారా ? అంటే సమాధానం ఉండదు. అమ్మాయిలు అంతా పెళ్లివరకూ కన్యలుగా ఉండాలి. మరి మగాడి పవిత్రత ఎవరికీ అక్కర్లేదా ?
తాజాగా ఓ ప్రభుత్వం చేసిన పనికి .. అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. ఆడపిల్ల పుట్టిన దగ్గరి నుండి పెళ్లిచేసి పంపి..ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టేంతవరకూ ఖర్చులుంటూనే ఉంటాయి. పేద కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 18 ఏళ్లైనా రాకుండా పెళ్లిళ్లు చేసేస్తారు. 20 వచ్చేసరికి ఇద్దరు పిల్లల తల్లులై కూర్చుంటారు. ఈ క్రమంలో పేద, బీద కుటుంబాల్లో పుట్టిన అమ్మాయిలకు అన్ని ఖర్చుల భరించి సామూహిక వివాహాలు చేసే పథకం తీసుకువచ్చింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. కానీ పథకం పేరుతో ఆ ప్రభుత్వం చేసిన ఓ పని వివాదాస్పదంగా మారింది.
సామూహిక వివాహాల నిర్వహణ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన’ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. 2006 నుండి ఈ పథకం అమలవుతోంది. ఈ పథకం కింద వివాహం చేసుకునే వారికి రూ.56 వేల నగదు సహాయాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా డిండౌరి జిల్లా గాడాసరయీ పట్టణంలో శనివారం 219 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. సామూహిక వివాహాల కోసం పేర్లు నమోదు చేసుకున్న యువతులకు గర్భనిర్థారణ పరీక్షలు చేయగా.. ఐదుగురు యువతులు గర్భవతులని తేలింది. దాంతో వారిని వివాహాలు చేసుకునేందుకు అనుమతించలేదు. ఈ వ్యవహారం ఇప్పుడు బయటకు పొక్కడంతో విషయం తెలిసిన వారంతా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఏ నిబంధన కింద ఆ యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని, ఇది పేదలను అవమానించడమేనంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. వారికి గర్భనిర్ధారణ పరీక్షలు చేసేందుకు మిమ్మల్ని ఎవరు ఆదేశించారని అధికారులను ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై వస్తోన్న విమర్శలను డిండౌరి కలెక్టర్ వికాశ్ మిశ్రా తోసిపుచ్చారు. అయితే, ఈ విమర్శలను డిండౌరి కలెక్టర్ వికాశ్ మిశ్రా తోసిపుచ్చారు. సామూహిక వివాహా కార్యక్రమంలో పేర్లు నమోదుచేసుకునే యువతులకు సికిల్ సెల్ (రక్తహీనత) పరీక్షలు నిర్వహించాలని మార్గదర్శకాల్లో ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలో దరఖాస్తు చేసుకున్న యువతులకు సికిల్ సెల్ పరీక్షలు చేస్తుండగా.. కొందరు యువతులు తమకు నెలసరి సంబంధిత సమస్యలు ఉన్నాయని తెలిపారని, దాంతో వైద్యులు వారికి గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురు యువతులు గర్భవతులు అని తేలిందన్నారు. సామూహిక వివాహాలు చేసుకునే యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలనే నిబంధన ఏమీ లేదని వికాశ్ మిశ్రా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Next Story