Fri Dec 20 2024 16:38:24 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుండి రూ.2వేల నోట్ల మార్పిడి.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
వాటన్నింటినీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతాదాస్ కొట్టిపారేశారు. రెండువేల నోట్ల మార్పిడి విషయంలో ప్రజలకు ఎలాంటి అనుమానాలు..
రూ.500,రూ.1000 రద్దు సమయంలో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి రూ.2000 నోట్ల మార్పిడిపై రకరకాల పుకార్లు వస్తున్నాయి. వాటన్నింటినీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతాదాస్ కొట్టిపారేశారు. రెండువేల నోట్ల మార్పిడి విషయంలో ప్రజలకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. రేపటి నుంచి బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇచ్చిన నాలుగు నెలల గడువులోగా.. అంటే సెప్టెంబర్ 30 లోగా ప్రజలు తమవద్దనున్న రూ.2000 నోట్లను బ్యాంకులకు రిటర్న్ చేసి అందుకు తగిన చిల్లర తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకరోజుకు ఒక్కొక్కరు రూ.20,000 (10నోట్లు) మాత్రమే మార్చుకోవాలని చెప్పారు.
నోట్లను మార్చకుండా డిపాజిట్ చేయదలచిన వారు.. రూ.50,000 కంటే ఎక్కువ డిపాజిట్ ఉన్న నేపథ్యంలో పాన్ కార్డు జిరాక్స్ ను తప్పనిసరిగా జతచేయాలని తెలిపారు. ప్రస్తుతం బ్యాంకుల్లో డిపాజిట్లకు ఉన్న నియమ, నిబంధనలు రూ.2000 నోట్లు డిపాజిట్ల విషయంలోనూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. పెద్దమొత్తంలో జరిగే డిపాజిట్ల గురించి ఇన్ కం ట్యాక్స్ అధికారులు చూసుకుంటారని తెలిపారు. కాగా.. నోట్ల మార్పిడికి ఎలాంటి ఫారమ్ లు ఉండబోవన్న ఆయన.. ఎలాంటి రుసుము కూడా చెల్లించనక్కర్లేదని చెప్పారు. నోట్ల మార్పిడికి, డిపాజిట్ కు ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బ్యాంకులు టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రూ.1000 నోట్లను మళ్లీ చలామణిలోకి తీసుకువస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అలాంటి వాటిని ప్రజలు నమ్మొద్దని తెలిపారు.
Next Story