ఎయిర్ ఇండియాకు ఊహించని షాక్.. హైదరాబాద్ సెంటర్‌పై ఆంక్షలు
టాటా కంపెనీ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఊహించని షాక్ ఇచ్చింది
టాటా కంపెనీ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఊహించని షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని సిమ్యులేటర్ ట్రైనింగ్ ఫెసిలిటీ సెంటర్‌పై నిషేధం విధించింది. ముంబయి సిమ్యులేటర్ సెంటర్‌పై చర్యలు తీసుకున్న మూడు రోజుల్లోనే హైదరాబాద్ సెంటర్‌పై ఆంక్షలు విధించింది. ఈ కేంద్రంలో పైలెట్లకు ఇచ్చే శిక్షణలో కొన్ని లోపాలున్నట్టు తనిఖీల్లో తేలింది. ఆయా సిమ్యులేటర్ ఫెసిలిటీ సెంటర్లలో శిక్షణా కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఎయిర్ ఇండియా ముంబయిలో కేంద్రంలో బోయింగ్ 777, బీ787 విమాన పైలెట్లకు, హైదరాబాద్‌లో ఎయిర్‌బస్ ఏ-320 విమాన పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. రెండు కీలకమైన ఫిసిలిటీ సెంటర్లలో కార్యకలాపాలు నిలిపివేయడంతో ఎయిర్ ఇండియాకు శిక్షణకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఎయిర్ ఇండియా స్పందించాల్సి ఉంది. తనిఖీలకు సంబంధించి డీజీసీఏ ఇచ్చిన సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని దిద్దుబాటు చర్యలు చేపడుతామని ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి తెలిపారు. ఎయిర్ ఇండియాలో తనిఖీలకు సంబంధించి డీజీసీఏ ఇప్పటి వరకు స్పందించలేదు.