Mon Dec 23 2024 10:05:12 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతం.. అక్కడ మొదట అడుగుపెట్టింది మనమే..!
చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ముగిసింది
చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. సాయంత్రం గం.6.05 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని ముద్దాడింది. ఈ అద్భుతం సాక్షాత్కారం అయినందుకు శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
బుధవారం సాయంత్రం 5.44 గంటల ప్రాంతంలో ల్యాండర్ మాడ్యూల్.. ల్యాండింగ్‌ను నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంది. ఇస్రో ల్యాండింగ్ మాడ్యూల్‌కు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ALS) కమాండ్‌ను పంపించింది. ఈ కమాండ్‌ను అందుకున్న ల్యాండర్ మాడ్యూల్ తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ మొదలుపెట్టింది. రఫ్ బ్రేకింగ్ దశను విజయవంతంగా ముగించుకుని జాబిల్లి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్ తన దిశను మార్చుకుంది. ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (ఎల్పీడీసీ), కేఏ బ్యాండ్ అండ్ లేజర్ బేస్డ్ ఆల్టీమీటర్లు, లేజర్ డాప్లర్ వెలోసీమీటర్ వంటి సాధనాలతో ల్యాండ్ అవ్వాల్సిన ప్రాంతాన్ని నిర్దేశించుకుంది. ఆ తర్వాత దశల వారీగా నెమ్మదిగా జాబిల్లి ఉపరితలం మీదకు చేరుకుంది. ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని చంద్రుడిపై కాలుమోపింది.
Next Story