రాహుల్ టార్గెట్‌గా.. స్మృతి ఇరానీ తీవ్ర వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ.. బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ.. బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ ఇంకా వయనాడ్ ఎంపీగా ఉంటే ఆ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు, గతంలో అమేథీ ప్రజలకు పట్టిన దుస్థితే పట్టేదని ఘాటూగా వ్యాఖ్యానించారు. కేరళలోని తిరువనంతపురంలో భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర స్థాయి మహిళా కార్మిక సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు హాజరైన స్మృతి ఇరానీ.. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. గాంధీ వారసుడు రాహుల్ అమేథీ సీటును తన చేతిలో కోల్పోయారని, ఆయన వయనాడ్ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదన్నారు.
పరువు నష్టం కేసులో దోషిగా తేలడానికి ముందు, రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుండి కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అమేథీ ఎంపీగా రాహుల్ ఉన్నన్ని రోజులు.. 80 శాతం మంది ప్రజలు కరెంట్ పంపిణీ లేక చీకట్లో తమ జీవనాన్ని గడిపేవారని అన్నారు. రాహుల్ అమేథీ ఎంపీగా ఉన్నంతకాలం నిద్రపోయారని, ప్రజలు సమస్యలను ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు. రాహుల్ ఎంపీగా ఉన్నప్పుడు అమేథీలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, మెడికల్ కాలేజీ, సెంట్రల్ యూనివర్సిటీ, సైనిక్ స్కూల్, జిల్లా స్థాయి ఆస్పత్రి, డయాలసిస్ సెంట్ వంటి మెడికల్ ఫెసిలిటీలు ఏవీ లేవని, ఆయన వెళ్లిపోగానే ఈ సదుపాయాలు, సౌకర్యాలు అన్ని అందుబాటులోకి వచ్చాయన్నారు.
ఒక వేళ రాహుల్ ఇంకా వయనాడ్‌లోనే ఉంటే, అమేథీ పట్టిన గతే వస్తుందని, అందుకే ఆయనను వయనాడ్‌లో లేకుండా మీరే చూసుకోవాలన్నారు. తాను దేశంలో ఎక్కడ ఉన్నా వయనాడ్ గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటానని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. 'దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో' అంటూ 2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌పై దాఖలైన పరువునష్టం దావాలో గుజరాత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ప్రజాపాతినిధ్య చట్టం ప్రకారం.. రాహుల్‌పై ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాహుల్ అనర్హత వేటు ఎదుర్కొంటున్నారు.