Tue Nov 05 2024 23:41:29 GMT+0000 (Coordinated Universal Time)
కూల్ న్యూస్.. కేరళను తాకిన రుతుపవనాలు
జూన్ 1వ తేదీకే రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉండగా.. ఈ ఏడాది 4వ తేదీకి వస్తాయని ఐఎండీ తెలిపింది. కానీ
నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారికంగా వెల్లడించింది. లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్లు వెల్లడించింది. జూన్ 1వ తేదీకే రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉండగా.. ఈ ఏడాది 4వ తేదీకి వస్తాయని ఐఎండీ తెలిపింది. కానీ అంచనాలను దాటి.. మరో నాలుగు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు కేరళను తాకాయి. మరో వారంరోజుల తర్వాత రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాల రాకతో ఇప్పటివరకూ ప్రజలను అల్లాడిస్తున్న అధిక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి.
కాగా.. అరేబియా సముద్రంలో బిపర్ జోయ్ అత్యంత తీవ్రతుపానుగా కొనసాగుతోంది. జూన్ 12 వరకు తుపాన్ తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ చెబుతోంది. వాతావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్లు బలపడుతున్నాయని తెలిపింది. తుపాను, అల్పపీడనంల ప్రభావంతో దక్షిణ ద్వీపకల్పంలో వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడించారు. మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. నిన్నటి వరకూ అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
Next Story