పాక్ జాతిపిత కూడా పొగిడిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్
భారత్ స్వాతంత్ర్యం సాధించుకున్న తర్వాత నేతాజీ ఉండి ఉంటే దేశ విభజన జరిగేది కాదని అజిత్ ధోవల్ అభిప్రాయపడ్డారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఢిల్లీలో జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారతీయులు పక్షుల్లా స్వేచ్ఛగా తిరగాలని సుభాష్ చంద్రబోస్ కోరుకున్నారని అన్నారు. దేశ స్వాతంత్ర్యాన్ని మించినది ఏదీ లేదని ఆయన భావించేవారని.. దాన్ని సాధించడం కోసం దేనికీ రాజీపడలేదని అజిత్ దోవల్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ భారతదేశాన్ని బ్రిటీషర్ల నుండి విముక్తి చేయడమే కాకుండా ప్రజల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఆలోచనలను మార్చాల్సిన అవసరం ఉందని భావించారన్నారు. నేను స్వాతంత్య్రం కోసం ఎవరిని అడుక్కోను అనే సిద్ధాంతం నేతాజీది అని.. నేను బ్రిటీష్ వారితో పోరాడుతాను కానీ, స్వాతంత్య్రాన్ని అడుక్కోకూడదని భావించేవారన్నారు. స్వాతంత్య్రం తన హక్కు అని నేతాజీ భావించారని అన్నారు. సుభాష్ చంద్రబోస్ ఉండి ఉంటే భారతదేశం విభజించబడి ఉండేది కాదని అన్నారు. గతంలో పాకిస్తాన్ జాతిపిత అలీ జిన్నా కూడా సుభాష్ చంద్రబోస్ ని ప్రశంసించారని.. నేను ఒక నాయకుడిని మాత్రమే అంగీకరించగలను, అది సుభాష్ చంద్రబోస్ అని జిన్నా అన్నారని అజిత్ దోవల్ తెలిపారు. నేను ఇక్కడ మంచి చెడుల గురించి మాట్లాడట్లేదని.. కానీ, భారత్తో పాటూ ప్రపంచ చరిత్రలో పరిస్థితులకు ఎదురీదిన వారు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. మహాత్మా గాంధీని సైతం ప్రశ్నించగలిగిన ధైర్యసాహసాలు ఆయన సొంతమని అజిత్ దోవల్ చెప్పుకొచ్చారు.