రాజద్రోహం చట్టానికి బ్రేక్.. సుప్రీం చారిత్రక నిర్ణయం
రాజద్రోహం చట్టాన్ని అక్రమ నిర్బంధానికి వాడుకుంటున్నారంటూ ఆరోపణలున్నాయి. ఈ చట్టం అమలుపై సుప్రీం కీలక ఆదేశాలిచ్చింది.
బ్రిటిష్ కాలంనాటి రాజద్రోహం చట్టం అమలుపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాజద్రోహం చట్టం అమలుపై స్టే విధించింది. రాజద్రోహం చట్టం అమలును సమీక్షించిన సీజీఐ ఎన్వీ రమణ ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజద్రోహం చట్టాన్ని పున:పరిశీలిస్తున్నట్ల కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అప్పటి వరకూ ఈ చట్టం కింద కేసులు నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ రాజద్రోహం చట్టం 124 ఏ కింద ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని సుప్రీం స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసులో జైలులో ఇరుక్కున్న వారు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చని తెలిపింది.
కేంద్రం రాజద్రోహం చట్టాన్ని సమీక్షించనున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ నమోదైన కేసులు.. ఇకపై నమోదు కాబోయే కేసులపై ఎలాంటి వైఖరి అనుసరించనున్నారో చెప్పాలని సుప్రీం కేంద్రాన్ని కోరింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమీక్ష పూర్తయ్యే వరకూ కేసులు నమోదు చేయకుండా నిలిపివేయాల్సిన అవసరం లేదన్నారు. టెర్రరిజం, మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన నేరాల్లో కేసు నమోదు చేయకుండా ఉండలేమన్నారు. అయితే రాజద్రోహం కేసు నమోదు చేసేందుకు ఓ ఐపీఎస్, లేదా ఉన్నత స్థాయి అధికారి ఆమోదం ఉండేలా మార్గదర్శకాలను రూపొందించాలనుకుంటున్నట్లు తెలిపారు.
కేంద్రం వాదనలను సుప్రీం తోసిపుచ్చింది. పౌరుల హక్కులు, దేశ సమగ్రత నడుమ సమతుల్యత అవసరమని సీజేఐ అభిప్రాయపడ్డారు. చట్టాన్ని సమీక్షించేంత వరకూ కేసులు నమోదు చేయడం సరికాదని.. ఈ చట్టం అమలుపై స్టే విధిస్తున్నట్లు సీజేఐ చెప్పారు. అప్పటి వరకూ కొత్త కేసులు నమోదు కావని విశ్వసిస్తున్నామని.. ఒకవేళ కేసులు నమోదైతే బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించొచ్చని సుప్రీం తెలిపింది. పున:పరిశీలనను ప్రభుత్వానికి వదిలేయాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.