Tue Nov 05 2024 19:35:11 GMT+0000 (Coordinated Universal Time)
జ్యోతిష్యుడి మాట విని నాలుకపై పాము కాటు వేయించుకున్నాడు.. తీరా చూస్తే..
జ్యోతిష్యుడి సలహా గుడ్డిగా పాటించిన రాజా తన నాలుకని కోల్పోయాడు. చెప్పినట్టుగానే రాజా ఓ సర్ప మందిరానికి వెళ్లి పూజలు..
జ్యోతిష్యుడి మాటలు విని ఓ వ్యక్తి నాలుక కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ-రోడ్ లోని గోపిచెట్టిపాళయంకు చెందిన రాజా వ్యవసాయం చేసుకునే రైతు. ఆయన వయసు 54 సంవత్సరాలు. ఇటీవల కలలో తరచూ పాము కరుస్తున్నట్టుగా రావడంతో.. భయపడి స్థానిక జ్యోతిష్యుడి వద్దకు వెళ్లాడు. పాము కాటేస్తున్నట్టుగా కలలు వస్తున్న విషయాన్ని చెప్పాడు. ఈ పీడకలలు పోవాలంటే.. పాము పుట్ట ఉన్న ఆలయానికి వెళ్లి పూజలు చేశాక.. పాము ముందు మూడుసార్లు నాలుక బయటికి చాపాలని సూచించాడు.
జ్యోతిష్యుడి సలహా గుడ్డిగా పాటించిన రాజా తన నాలుకని కోల్పోయాడు. చెప్పినట్టుగానే రాజా ఓ సర్ప మందిరానికి వెళ్లి పూజలు చేశాడు. అనంతరం, ఆలయంలోని పుట్ట వద్దకు వెళ్లి మూడుసార్లు నాలుక బయటికి చాపాడు. అయితే ఆ పుట్టలో ఉన్న రక్తపింజరి పాము రాజా నాలుకపై కసిదీరా కాటేసింది. ఇది గమనించిన ఆలయ పూజారి, రాజా కుటుంబ సభ్యులు వెంటనే స్పందించారు. కాటు వేసిన నాలుక భాగాన్ని కోసివేసి, రాజాను హుటాహుటీన ఈరోడ్ లోని మణియన్ ఆసుపత్రికి తరలించారు.
నాలుకని కట్ చేయడంతో తీవ్ర రక్తస్రావమవగా.. ఆస్పత్రికి వెళ్లేలోపే రాజా స్పృహ కోల్పోయాడు. సగం తెగిపోయిన అతడి నాలుకకు చికిత్స చేసిన వైద్యులు, పాము విషానికి విరుగుడుగా యాంటీ వీనమ్ ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడని ఆస్పత్రి ఎండీ సెంథిల్ కుమరన్ వెల్లడించారు.
Next Story