Mon Dec 23 2024 04:31:43 GMT+0000 (Coordinated Universal Time)
మనీలాండరింగ్ కేసులో మంత్రి అరెస్ట్ : వెక్కివెక్కి ఏడ్చారు
సెంథిల్ బాలాజీ భారీగా మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీకి ఆధారాలు, కీలక పత్రాలు లభించడంతో బుధవారం ఉదయం అరెస్ట్..
మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం (జూన్13) మధ్యాహ్నం 2 గంటల నుండి సచివాలయంలోని ఆయన కార్యాలయంతో పాటు కోయంబత్తూర్, కడూర్ నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ‘క్యాష్ ఫర్ జాబ్’ మనీలాండరింగ్ కేసులో ఈడీ సోదాలు నిర్వహించింది. 18 గంటలపాటు మంత్రిని ఆయన ఇంట్లోనే ప్రశ్నించిన అనంతరం మంత్రిని అరెస్ట్ చేస్తునట్లు ఈడీ అధికారులు తెలిపారు. తమిళనాడు చీఫ్ సెక్రటేరియట్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ సోదాలు, కరూర్ నివాసంలో నిర్వహించిన సోదాలు కూడా పూర్తయ్యాయి.
సెంథిల్ బాలాజీ భారీగా మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీకి ఆధారాలు, కీలక పత్రాలు లభించడంతో బుధవారం ఉదయం అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. అరెస్ట్ విషయం వినగానే మంత్రి ఛాతీలో నొప్పంటూ కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను చెన్నైలోని ఒమంతురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పరీక్షలు చేస్తున్నారు. వైద్యపరీక్షలు, చికిత్స అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న మంత్రి సెంథిల్ ను తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, సుబ్రమణ్యం, ఎవ వేలు, రఘుపతి, శేఖర్ బాబు తదితరులు పరామర్శించారు. సెంథిల్ బాలాజీకి చికిత్స కొనసాగుతోందని మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. బీజేపీ రాజకీయాలకు తాము భయపడే ప్రస్తక్తే లేదని, దీనిని చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అంతకుముందు ఈడీ అదుపులోకి తీసుకుందని మంత్రి సెంథిల్ బాలాజీ వెక్కివెక్కి ఏడ్చారు. ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story