Mon Dec 23 2024 12:46:28 GMT+0000 (Coordinated Universal Time)
400 సంవత్సరాల నాటి విగ్రహం వారి చేతుల్లో.. ధర ఎంతంటే..?
2.30 కోట్లతో విగ్రహాలను కొనుగోలు చేసేందుకు పోలీసులు బేరసారాలు జరిపారు.
తమిళనాడు పోలీసులు, ఐడల్ వింగ్ కలిసి 400 ఏళ్ల నాటి సేతుపతి వంశానికి చెందిన మహిళ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహం ధర 2 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. విగ్రహాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న స్మగ్లర్ల ను తిరుచ్చి-మధురై హైవేపై అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. తూత్తుకుడిలో నివాసముంటున్న ఆరుముగరాజ్ (56), కుమారవేల్ (32) అనే ఇద్దరు వ్యక్తులు పురాతన విగ్రహాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం అందడంతో విగ్రహ విభాగం రంగంలోకి దిగింది. ఐడల్ వింగ్ హెడ్‌క్వార్టర్స్‌కు సమాచారం అందడంతో ఐడల్ వింగ్ డైరెక్టర్ జనరల్ కె జయంత్ మురళి, ఐడల్ వింగ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దినకరన్, ఐడల్ వింగ్ పోలీస్ సూపరింటెండెంట్ రవిలు విగ్రహ విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు.
ధనవంతులుగా నటిస్తూ పోలీసులే విగ్రహాన్ని కొంటామని స్మగ్లర్లతో మాట్లాడారు. అలా అమ్మకందారులను సంప్రదించారు. మదురై రేంజ్‌లోని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏడీఎస్పీ) మలైసామి నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఐడల్ వింగ్ సిబ్బంది వ్యూహం పన్నారు. స్మగ్లర్లను బురిడీ కొట్టించి.. పురాతన విగ్రహం ఉన్న వ్యక్తిని బృందం గుర్తించింది. ఐడల్ వింగ్ బృందం విగ్రహాన్ని అమ్ముతున్న వ్యక్తులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తిరుచ్చి జిల్లాకు చెందిన 31 ఏళ్ల ముస్తఫా అనే వ్యక్తి పురాతన విగ్రహాన్ని తిరుచ్చి-మదురై హైవేపై ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి తీసుకువచ్చాడు.
2.30 కోట్లతో విగ్రహాలను కొనుగోలు చేసేందుకు పోలీసులు బేరసారాలు జరిపారు. విగ్రహాన్ని చూడటానికి కూడా పోలీసులవద్ద డబ్బు ఉందని నిరూపించుకోవాల్సి వచ్చింది. ముస్తఫా, ఆరుముగరాజ్, కుమారవేల్‌లను పోలీసులు వెంటనే పట్టుకున్నారు. వారిని విచారించిన తరువాత తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తి నుండి విగ్రహాన్ని పొందినట్లు గుర్తించారు. "ఈ విగ్రహం గత పన్నెండేళ్లుగా అతని ఆధీనంలో ఉందని.. ఐదేళ్ల క్రితం మరణించిన అతని తండ్రి నాగరాజన్ దగ్గర అది ఉందని తేలింది. నాగరాజన్ ఒక జ్యోతిష్కుడు, ఒక కొబ్బరి వ్యాపారి నుండి అతను ఆ విగ్రహాన్ని అందుకున్నాడు." అని ఐడల్ వింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
Next Story