Fri Dec 20 2024 12:32:00 GMT+0000 (Coordinated Universal Time)
మందుబాబులకు షాక్.. 500 మద్యం దుకాణాలు మూసివేత
రాష్ట్రంలో క్రమంగా సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని డీఎంకే గత ఎన్నికల్లో ప్రకటించింది. చెప్పినదాని ప్రకారం..
మందుబాబులకు తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 500 మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ రిటైలర్ టాస్మాక్ ప్రకటన చేసింది. తొలివిడతలో స్కూళ్లు, దేవాలయాల సమీపంలోని మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. తమిళనాడులో 2023,మార్చి 31 నాటికి 5,329 రిటైల్ మద్యం దుకాణాలు ఉండగా.. వాటిలో 500 మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు మంత్రి సెంథిల్ బాలాజీ ఏప్రిల్ 12న ప్రకటించారు. ఈ మేరకు ఏప్రిల్ 20న జీఓ జారీ అయింది. జీఓ ఆధారంగా.. 500 రిటైల్ మద్యం దుకాణాలను గుర్తించి జూన్ 22 నుండి మూసివేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
కాగా.. రాష్ట్రంలో క్రమంగా సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని డీఎంకే గత ఎన్నికల్లో ప్రకటించింది. చెప్పినదాని ప్రకారం.. స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మద్యపాన నిషేధంపై చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాల విధానంలో కీలక మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇక ఇటీవలే మంత్రి సెంథిల్ బాలాజీ ఇంటిపై దాడులు చేసిన ఈడీ.. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని, ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో ఆయన ఛాతీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. నొప్పి భరించలేక బోరున ఏడ్చారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సెంథిల్ బాలాజీ మరి కొద్దిరోజులు ఆసుపత్రిలో ఉండాలని కోర్టులో పిటిషన్ వేయగా.. మద్రాసు హైకోర్టు అందుకు పర్మిషన్ ఇచ్చింది. మద్రాస్ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకు వెళ్లగా.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
Next Story